ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్లుంది కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహారం. మహిళా సాధికారతకు సంబంధించి అనేక దేశీయ, అంతర్జాతీయ నివేదికల్లో భారతీయ మహిళల పరిస్థితి కనిష్ఠ ర్యాంకుల్లో కునారిల్లుతుంటే.. ఆ పరిస్థితులను మెరుగుపరచకుండా.. స్త్రీల వివాహ వయస్సును 21 ఏండ్లకు పెంచే ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ మేరకు గత డిసెంబరులో ‘బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు’ను లోక్సభలో ప్రవేశపెట్టింది. అటు ప్రజల నుంచేగాక ఇటు సామాజికవేత్తల నుంచి కూడా ఈ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
స్త్రీల వివాహ వయస్సు పెంపును మోదీ సర్కార్ గొప్ప మహిళా సాధికారక చర్యగా చెప్పుకొంటున్నది. కానీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బాల్యవివాహాల నిషేధ చట్టం ఏ మేరకు పని చేస్తుంది? ఆ చట్టం అందిస్తున్న సత్ఫలితాలేమిటి? అన్నది చర్చించుకుంటేగానీ ఈ వాస్తవాలేమిటో బోధపడవు. ఇటీవలి ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ వెల్లడించిన వివరాల ప్రకారం.. 20-24 ఏండ్లలోపు మహిళల్లో 23 శాతం మంది 18 ఏండ్లలోపే పెండ్లి చేసుకున్నారు. గ్రామీణప్రాంతాల్లోనైతే ఇది 27 శాతంగా ఉంది. అంటే బాల్యవివాహాల నిషేధ చట్టం ఉన్నా కూడా దేశంలో నాలుగోవంతు మహిళల వివాహాలు 18 ఏండ్లలోపే జరుగుతున్నాయి.
అసలు బాల్య వివాహాలకు కారణాలేమిటి? నిరక్షరాస్యత, వరకట్నం, బిడ్డకు తొందరగా పెండ్లి చేసి పంపితే కుటుంబ ఖర్చుల నుంచి ఒకరి భారం తగ్గించుకోవచ్చు అనేంత పేదరికం, సామాజిక ఒత్తిడి, బాలికలకు సమాజంలో కరువవుతున్న భద్రత, పిల్లలు పెరిగితే కులాంతర వివాహం చేసుకునే అవకాశం ఉందన్న భయం. బాగా చదువుకున్న, ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాల్లో, అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో బాల్యవివాహాలు దాదాపుగా జరగటం లేదు. ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్ ఫండ్ వెలువరించిన ‘స్టేట్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్-2020’ ప్రకారం.. భారత్లో చదువుకోని బాలికల్లో 51 శాతం మంది, ప్రాథమిక విద్య మాత్రమే చదివిన వారిలో 47 శాతం మంది, మాధ్యమిక విద్య పూర్తి చేసినవారిలో 29 శాతం మంది 18 ఏండ్లలోపే పెండ్లి చేసుకుంటున్నారు.
పదోతరగతి అంతకంటే ఎక్కువ చదువుకున్న యువతుల్లో ఇది కేవలం 4 శాతంగా ఉంటున్నది. అంటే చదువు పెరుగుతున్నా బాల్యవివాహాలు తగ్గుతున్నాయనేది స్పష్టమవుతున్నది. మోదీ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే.. విద్య, ఆర్థిక, ఉద్యోగ కల్పన రంగాల్లో మహిళాభివృద్ధికి కృషి చేయాలి. అంతేగానీ, 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు వివాహ వయస్సును పెంచితే ఒరిగేదేమీ ఉండకపోగా, అప్పటివరకూ అమ్మాయిలు చట్టం దృష్టిలో మైనర్లుగా ఉంటూ.. తల్లిదండ్రుల, కుటుంబసభ్యుల ఒత్తిళ్లకు లోనై జీవించే పరిస్థితులు ఏర్పడుతాయి. ఇటువంటి సున్నిత అంశాలపై కేంద్రం ఏకపక్షంగా, హ్రస్వదృష్టితో వెళ్లకుండా.. సామాజిక నిపుణుల, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి.