అస్సాం, మిజోరం రాష్ర్టాల మధ్య ఘర్షణ జరిగి ఐదుగురు పోలీసులు మరణించడం, పలువురు గాయపడటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. రెండు రాష్ర్టాల మధ్య సంబంధాలు ఉద్రిక్తపూరితమై, అవి ఘర్షణల స్థాయికి చేరాయంటే ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు? ఈ సమస్య హఠాత్తుగా జనించింది కూడా కాదు. కేంద్రంలో పార్టీలు మారినా స్వభావం మాత్రం మారలేదనడానికి ఇదొక నిదర్శనం. వీలైనప్పుడల్లా రాష్ర్టాల హక్కులను హరించే కేంద్ర ప్రభుత్వం వాటి మధ్య సమస్యలను మాత్రం పరిష్కరించకుండా నిద్రావస్థలో ఉంటున్నది. ఘర్షణలు జరిగినప్పుడు మొక్కుబడిగా చర్చలు జరపడమే తప్ప ఇంతవరకు చిత్తశుద్ధితో, కార్యదక్షతతో సమస్యలను పరిష్కరించింది లేదు. ఈశాన్యంలోనే కాదు, ఇతర ప్రాంతాల విషయంలోనూ కేంద్రం వైఖరి ఇదే తరహాలో ఉంటున్నది.
మిజోరం ఒకప్పుడు అస్సాం రాష్ట్రంలో భాగమే. 1972లో కేంద్ర పాలితంగా మారి 1987లో రాష్ట్రంగా అవతరించింది. గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు స్థానిక జాతుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, హద్దులు పాటించడం అనేది పూర్వం నుంచి ఉన్నది. 1875లో (బ్రిటిష్ కాలంలో) మిజో తెగ నాయకులను సంప్రదించి గీసిన హద్దు మాత్రమే తమకు సమ్మతమని మిజోరం ప్రభుత్వం అంటున్నది. 1993 నాటి నోటిఫికేషన్ ఆధారంగా హద్దు నిర్ణయించాలనేది అస్సాం వాదన. ‘అస్సాంలోని అక్రమ బంగ్లాదేశీయులు మాకు పెద్ద సమస్యగా మారారు. వారు మా ప్రాంతంలోకి ప్రవేశించి గుడిసెలు తగులబెడతారు. పంటలను ధ్వంసం చేస్తారు. మా పోలీసులపై రాళ్ళు రువ్వుతారు’ అంటూ మిజో జిర్లాయి పాల్ (మిజో విద్యార్థి సంఘం) చేస్తున్న ఆరోపణ కూడా గమనార్హమైనది. కేంద్ర ప్రభుత్వం కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షక పాత్ర వహించడం వల్లనే ఇవాళ అస్సాంలో విదేశీయుల సమస్య చిక్కుముడిలా మారింది.
ఈ నెల 24వ తేదీ నాడు ఈశాన్య రాష్ర్టాలలో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ ప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం జరిపారు. ఈ ముఖ్యమంత్రుల ప్రధాన అభ్యర్థనల్లా రాష్ర్టాల సరిహద్దు సమస్యను సత్వరం పరిష్కరించాలనేదే! ఈశాన్యం అనేక తెగలు, జాతుల నిలయం. పలు తెగలు తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని భయపడటం సహజం. దీనికి తోడు సరిహద్దు పొడుగునా కొన్ని వేల కిలోమీటర్ల మేర టిబెట్ (చైనా), మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఉన్నాయి. ఇంత సున్నిత ప్రాంతంపై నాడు కాంగ్రెస్ మాదిరిగానే ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం తగదు. తక్షణమే అప్రమత్తమై రాష్ర్టాల మధ్య సమస్యలను ఆమోదయోగ్యకరమైన రీతిలో పరిష్కరించాలి.