‘దొరల నీకు కనుల నీరు దొరలదీ లోకం.. మగ దొరలదీ లోకం’ అనే ఉద్వేగ భరిత సినీ గేయ పంక్తులు గుర్తుకువస్తున్న సందర్భం ఇది. ఏం జరుగుతున్నది? ఎక్కడికి పోతున్నాం? నిండుసభలో ఆడబిడ్డలు అవమానపడి కన్నీరు పెట్టిన ఘట్టం ఏదో పురాణేతిహాసాల్లోది కాదు. ఇప్పుడే, ఇక్కడే మనం ఎన్నుకున్న చట్టసభలో జరుగుతున్నది. సభా నాయకుడి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి నేలబారు మాటలతో మర్యాదను మంటగలపడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు.
రేవంత్‌రెడ్డికి తాను ముఖ్యమంత్రినన్న సంగతి ఇంకా పూర్తిగా ఒంటబట్టినట్టు లేదు. అదీ మహిళా సభ్యుల గురించి కావడం మరింత బాధాకరం. ‘యత్రనార్యస్తు పూజ్యంతే’ అన్న సూక్తి ఏమైపోయింది! సభలో చమత్కారాలు ఫరవా లేదు. కానీ, మహిళా సభ్యులనుద్దేశించి దారుణమైన వెటకారాలకు పాల్పడటాన్ని ఎలా స్వీకరించాలి? తానిప్పుడు ప్రతిపక్షం కాదు, పాలకపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టానని ఆయన మరిచిపోతున్నారా?
నిన్న మొన్నటివరకు అధికారం అందనిపండుగా ఉన్నప్పుడు వీధుల్లో వీరంగం వేసి ఉండవచ్చు. నోటికొచ్చినట్టు మాట్లాడి ఉండవచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్నతస్థాయి పదవిలో ఉంటూ, గౌరవ శాసనసభలో మాట్లాడుతున్న సమయంలో అదే ధోరణిలో పోతానంటే ఎలా? తానిప్పుడు ప్రశ్నించే స్థితిలో లేరు. జవాబు చెప్పాల్సిన బాధ్యతలో ఉన్నారు. సభా మర్యాదలు గుర్తుంచుకొని వెనుకా ముందూ చూసుకుని మాట్లాడాల్సి ఉంది. సభను ఎవరైనా పక్కదారి పట్టిస్తే తాను సరైన దిశలో సాగేలా చూడాలి.
కానీ, తానే సభను పక్కదారి పట్టిస్తే ఎలా? కేవలం మహిళలనే కారణంగా వివక్షాపూరితంగా మాట్లాడితే చెల్లుతుందా? మహిళను ప్రధానిగా, రాష్ట్రపతిగా ఎన్నుకొని గౌరవించుకున్న దేశం మనది. రాజకీయాల్లో మహిళలు రాణించడమే గిట్టనట్టుగా మాట్లాడటం ద్వారా రేవంత్ ఏం చెప్పదల్చుకున్నారో అర్థం కావడం లేదు. పైగా మహిళాసభ్యులను కించపర్చేందుకు ఆయన ఉటంకించిన ఉదంతాలకు సభలో జరుగుతున్న చర్చతో ఏ మాత్రం సంబంధం లేదు. పైగా సభ వెలుపల కూడా తన మాటలను సమర్థించుకుంటూ మాట్లాడటం విడ్డూరం. మహిళాసభ్యులు కంటతడి పెట్టేలా వ్యవహరించిన ఆయనలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని అది సూచిస్తున్నది.
ఎంతో నిగ్రహం కలవారు సైతం అప్పుడప్పుడు అదుపు తప్పి మాటజారడం జరగవచ్చు. అలా జరిగినప్పుడు మర్యాదకు, సంస్కారానికి లోబడి క్షమాపణ కోరడమనేది లోకరీతిగా వస్తున్నది. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించేవారి నుంచి ఇది మనం కనీసంగా ఆశిస్తాం. కానీ రేవంత్ తీరు మాత్రం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వెరపు అన్నట్టుగా ఉంది. ఆయనను ఏదో నిస్పృహ లేదా అభద్రత వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏదో ఆందోళన తరుముతుంటే తప్ప ఆ స్థాయిలో మాటలు జారడం అనేది జరుగదు.
మహిళలను గౌరవించాలని ఒక ముఖ్యమంత్రికి గుర్తుచేయాల్సిన అవసరం ఏర్పడటమే దురదృష్టకరం. ఆడబిడ్డలను ‘నీ పాదం మీద పుట్టు మచ్చనై’ అంటూ అపురూపంగా ఆదరించుకునే తెలంగాణ గడ్డ ఇలాంటి ధోరణులను ఎంతమాత్రం సహించదు. మొన్నటి ఎన్నికల్లో మోసపోయి గోసపడుతున్నమని వాపోతున్న మన సమాజం వీటన్నిటినీ గమనిస్తూనే ఉన్నది. విపరీత ధోరణులకు సరైన సమయంలో కర్రుగాల్చి వాత పెట్టడం తెలంగాణకు తెలుసు అన్న తెలివిడి పాలక పెద్దలకు అవసరం!