సుదీర్ఘకాలం కొనసాగిన ఏకపక్ష, నియంతృత్వ, అపరిపక్వ రాజకీయాలకు నిదర్శనం పాకిస్థాన్, శ్రీలంక సంక్షోభాలు. ఒక దేశంగా ఏర్పాటైన నాటినుంచీ నేటివరకూ పాకిస్థాన్‌లో ఏ పౌర ప్రభుత్వమూ ఐదేండ్లపాటు అధికారంలో లేదంటే అక్కడి వ్యవస్థలు ఎం త అప్రజాస్వామికంగా తయారైనాయో అర్థం చేసుకోవచ్చు. సైన్యం చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవహరించే ప్రభుత్వాలు ఈ పరిస్థితిని మార్చటానికి ఎన్నడూ ప్రయత్నించింది లేదు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్నదీ లేదు. ఇమ్రాన్‌ఖాన్ సర్కారు కూడా దీనికి మినహాయింపు కాదు. సైన్యం మద్దతుతో పదవి చేపట్టిన ఈ మాజీ క్రికెటర్ క్రమంగా ఆ సైన్యం కరుణ కోల్పోవటంతో అధికార నిచ్చెనలో ఉన్నపళంగా కిందికి పడిపోయారు.
శ్రీలంక విషయానికొస్తే.. రాజపక్సే కుటుంబం గుప్పిట్లోకి వెళ్లిపోయిన తర్వాతనే ఆ దేశం రావణకాష్ఠంలా మారింది. దశాబ్దాలపాటు కొనసాగిన అంతర్యుద్ధం ముగిసిన తర్వాత శ్రీలంక రాజకీయ నేతలు దేశాన్ని పునఃనిర్మించుకోవటం మీద దృష్టి పెట్టలేదు. అధికార చదరంగ క్రీడలో మహింద రాజపక్సే పైచేయి సాధించి, ప్రభుత్వాన్ని పూర్తిగా తన జేబు సంస్థగా మార్చివేశారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, కీలక మంత్రి పదవులన్నీ రాజపక్సే కుటుంబీకులే ఆక్రమించుకొని.. నియంతృత్వ రాజ్యాన్ని నెలకొల్పారు. జనంలో ఆగ్రహం తలెత్తకుండా, మైనారిటీల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొన్నారు. మరోవైపు రుణభారం పెరిగిపోయింది. ఈ విశృంఖల పాలన ఫలితమే నేడు శ్రీలంకలో కనిపిస్తున్న సంక్షోభం. ప్రజలకు నిత్యావసరాలను కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం చేతులెత్తేసి ఎమర్జెన్సీ విధించి చోద్యం చూస్తున్నది.
మన పొరుగుదేశాల్లో నెలకొన్న ఈ ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఆయాదేశాలకే కాదు, మనకూ గుణపాఠం వంటివే. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచి, సొంత ఇమేజీ పెంచుకొని, తిరుగులేని నాయకుడంటూ జనంలో లేనిపోని భ్రమలు కల్పించేవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన నేతల నియంతృత్వ పోకడల వల్లే దేశాలు అధోగతి పాలవుతున్నాయి. నాయకుడు ఎంత గొప్పవాడైనా గానీ.. ప్రజాస్వా మ్య నిబంధనలను పాటించకతప్పని కట్టుబాటు ఉండాలి. మనదేశంలో సవాలక్ష సమస్యలున్నప్పటికీ.. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు మారటం, స్వతంత్ర ఎన్నికల సంఘం, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటివి ప్రపంచంలో మనకొక గౌరవాన్ని తెచ్చి పెట్టాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలకు, సంప్రదాయాలకు తూట్లు పడుతున్నాయి. దేశ ప్రతిష్ఠ మసకబారుతున్నది. పొరుగుదేశాల సంక్షోభం మనదేశంలోనూ ప్రత్యక్షమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత సమాజం తన శక్తియుక్తులన్నింటినీ వినియోగించి ఇటువంటిది దాపురించకుండా దేశాన్ని కాపాడుకోవాలి.