‘సంక్రాంతిలోని క్రాంతి/ సమతావాది కవికి సంభ్రాంతి/ ఈ క్రాంతి పల్లెలో, పట్నంలో/ ఎల్ల ఎడలా పంటలా పండాలి… పంటలు ప్రతి పొలంలో పండాలి/… ప్రజల ఆకలి కడుపులు నిండాలి/ భారతి హృదయం వెచ్చగా ఉండాలి..’ అంటూ మనసు మనసున, పల్లె పల్లెనా పంటలను, భోగి మంటలను కాంక్షించాడు మహాకవి దాశరథి. ఆ స్వప్నాన్ని ఆచరణ సాధ్యం చేసిన తెలంగాణ సమాజం సంక్రాంతిని సంబురంగా జరుపుకొంటున్నది. కవి కాంక్షించినట్టు పట్నాలకు దీటుగా పల్లెల్లోనూ ఎల్లెడలా క్రాంతి గోచరిస్తున్న గొప్ప కాలానికి చేరుకున్నాం. అందుకే సంక్రాంతి సంబురాలు రైతు బంధు ఉత్సవాల పేర ఇంకా ముందే మొదలైనవి. పండుగ రోజులు విస్తరిల్లినయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ విధానాలతో ఏడాది పొడుగునా సంక్రాంతి శోభ వెల్లివిరుస్తున్నది.
పశ్చిమ రాష్ర్టాలలో మాఘి, తూర్పున అస్సాంలో బిహు, తమిళనాడులో పొంగల్.. పేర్లు వేరు కావచ్చు కానీ దాదాపుగా దక్షిణాసియా అంతటా ఏదో ఒక రూపంలో జరుపుకొనే పంటల పండుగ ఇది. కానీ ఇప్పుడు దేశం నడిబొడ్డున తెలంగాణలో వినిపిస్తున్న కేరింతలు వేరు. రైతుల మొహాలలో కొన్నేండ్లుగా విజయ దరహాసం కనబడుతున్నది. స్వరాష్ట్రంలో సాధించుకున్న విజయాల తాలూకు దర్పం తొణకిసలాడుతున్నది. కరెంటు, నీళ్ళు, ఎరువులు, విత్తనాలు, పెట్టుబడి.. ఒకటేమిటి? ప్రభుత్వమే అన్నీ సమకూర్చి అండగా నిలిచినప్పుడు రైతులకు లభించిన భరోసా ఈ వేడుకల్లో విప్పారుతున్నది. వరిధాన్యమో, చిరుధాన్యాలో, కూరగాయలో, ఆకుకూరలో, పండ్ల తోటలో- ఏది పండించినా లాభాలు తీయగలమనే గుండె ధైర్యం తెలంగాణ రైతులలో కనబడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో లభించిన భరోసా ఇది.
తెలంగాణలో స్వయం పాలన మొదలైన తర్వాత పల్లెపట్టుల్లో ధాన్యలక్ష్మి నర్తిస్తున్నది. పల్లె పట్నం తారతమ్యం లేకుండా ధనలక్ష్మి తాండవిస్తున్నది. అయినా కాలం అప్పుడప్పుడూ కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆ పరీక్షలకు తట్టుకొని నిలువడమే రైతుల నైజం, తెలంగాణ బిడ్డల తత్వం. పండించిన పంటను కొనబోమంటూ కేంద్రం బెదిరిస్తున్నా చెదరని ధీరులు తెలంగాణ వ్యవసాయదారులు. అందుకే నేటి రైతు బంధు ఉత్సవాలు సాధారణ సంబురాలు కాదు. ప్రతి చోటా జరిగే సాధారణ సంక్రాంతి సంబరాలూ కావివి. ఇవి వ్యవసాయాన్ని పండుగగా మార్చుకున్న సంక్రమణ కాంతులు. ఈ సందోహాలు తెలంగాణ సస్య విప్లవ విజయోత్సవ శంఖారావాలు. ఈ కర్షక ఘంటికా ధ్వానాలు కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై ధిక్కార స్వరాలు. ఈ భోగి మంటల భుగభుగలు తెలంగాణ స్వాభిమాన పతాకాల రెపరెపలు. కేసీఆర్ దార్శనికతను దేశవ్యాప్తంగా ప్రసరిస్తున్న నవ సంక్రాంతి సంకేత తరంగాలు.