బ్రిటిష్ వాడు రైళ్లు వేయడం వల్ల, విద్యావైద్య రంగాలను అభివృద్ధి చేయడం వల్ల భారతదేశం బాగుపడిందని మురిసిపోయేవారు కొందరు నాడూ ఉన్నారు, నేటికీ ఉన్నారు. కానీ, తెల్లదొరలు వచ్చింది మనలను బాగుచేయడానికి అనుకోవడం ఏమైనా బాగుంటుందా? భారతదేశ సంపదను వారు ఎంతెంత దోచుకుపోయారో లెక్కే లేదు. దోపిడీని వ్యవస్థీకృతం చేసేందుకు, సంపదను తరలించుకుపోయేందుకు చేసిన ఏర్పాట్లన్నింటినీ భారతదేశ భాగ్యవిధాతలని పొగడటం అవివేకం కాదా? అంతకన్నా బానిస మనస్తత్వం ఇంకొకటి ఉంటుందా? తెల్లోడు మనకు నాగరికత నేర్పాడంటే ఆమోదయోగ్యమవుతుందా? తెలంగాణ వ్యవసాయం గురించి కూడా ఈ గడ్డ మీద పుట్టిన కొందరికి ఈ తరహా భావాలే ఉండటం, అవి ఇప్పటికీ కొనసాగడం గురించి ఏమనుకోవాలి? అప్పుడెప్పుడో వందేండ్ల క్రితం నిజాంసాగర్ ఆనకట్ట కడితే ఆంధ్రావాళ్లు వచ్చి తెలంగాణ వాళ్లకు వ్యవసాయం ఎలా చేయాలో నేర్పారట. అంటే ఇక్కడ దండిగా నీళ్లున్నాయి కానీ సాగు తెలివిడి లేదని సెలవిస్తున్నారు ఘనత వహించిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సెటిలర్లు వచ్చారు. ప్రాజెక్టుల కింద భూములు కొన్నారు. ఎవుసం చేసుకొని బాగుపడ్డారు. అందరినీ ఆదరించి, అక్కున చేర్చుకునే తత్త్వం గల తెలంగాణ బిడ్డలు కూడా సెటిలర్లను కడుపులో పెట్టుకుని కాపాడారు. దీని మీద ఎవరికీ ఎలాంటి సందేహాలు, అభ్యంతరాలు లేవు. కానీ ‘సాగు నేర్పడం’ అంటే కచ్చితంగా బానిస బుద్ధే. పాతికేండ్ల కిందట ఓ నవలలో ఇలాంటి భావాలే రచయిత్రి వ్యక్తం చేసినప్పుడు పెద్ద దుమారమే చెలరేగడం ఈ సందర్భంగా గుర్తుకు రాకమానదు.
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రైతులను ఆగమాగం చేసినోళ్లు ఇప్పుడు రైతు ఆత్మగౌరవానికే ఎసరు తెస్తున్నారు తమ అతి తెలివితో. రైతు మహోత్సవం వేదికపై తెలంగాణ రైతుకు అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడం ఎలా అర్థం చేసుకోవాలి? ఎంతైనా తెలంగాణ సోయి లేని పార్టీకి పెద్ద కదా.. ఆ మాత్రం పొరుగు బానిసత్వం ఉండొచ్చునని సరిపెట్టుకోవాలా? ఆంధ్రాలో కాటన్ కట్టిన ఆనకట్టల తర్వాతే వ్యవసాయం బాగుపడిందన్న మాట నిజం. వాళ్లు ఆయనకు గుళ్లూ గోపురాలు కట్టి, విగ్రహాలు పెట్టి పూజిస్తారు. ఆయన కూడా బ్రిటిష్ ఖజానాకు పన్ను చెల్లింపులు మెరుగు పర్చడానికే ఆనకట్టలు కట్టారంటారు, అది వేరే విషయం. కానీ, ఈ గడ్డ మీద ఎప్పుడో శతాబ్దాల కిందట కాకతీయులు తవ్వించిన గొలుసుకట్టు చెరువుల కింద కొనసాగిన వ్యవసాయ వైభవం మాటేమిటి? మెతుకుసీమ నుంచి బర్మాలోని అరకాన్ దాకా ధాన్యం బస్తాలతో బండ్ల బారు ఎడతెరిపి లేకుండా సాగిపోయిన సంగతి పాపం ఆయనకు ఎవరైనా చెప్తే బాగుండేదేమో.
కాటన్‌కు పూర్వం ఆంధ్రావాళ్లు పనులు వెతుక్కుంటూ తెలంగాణ ప్రాంతానికి బతుకొచ్చిన సంగతి కూడా మరుగునపడిపోయింది. నిజమే, తెలంగాణలో కాలువల వ్యవసాయం తక్కువ, చెరువుల వ్యవసాయమే ఎక్కువ. అయితే, అవి మామూలు చెరువులు కావు. బొట్టు బొట్టు వాన నీరు ఒడిసిపట్టి, మెట్టు మెట్టుగా కట్టుకుంటూ పోయిన గొలుసుకట్టు చెరువులు. సాగు చరితలో అదొక చెరగని మైలురాయి. నీటి పారుదలలో సువర్ణాధ్యాయం. ఒక్క పాకాల కిందనే 15 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ‘పాకాల చెరువు కింద దున్నపోతు వెన్నిరిసినట్టు’ వంటి సామెతలు ఇక్కడి వ్యవసాయం గొప్పదనాన్ని చాటుతాయి. ఈ గతవైభవ జ్ఞానం లేని పీసీసీ అధ్యక్షుడు ఇక్కడి ప్రజల స్వాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. పొరుగువారి అంటకాగే లేదా వారి మోచేతి నీళ్లు తాగే గుణమున్న నేతలకు కాంగ్రెస్‌లో ఎప్పుడూ కొదువ లేదు. ప్రభుత్వ సారథే పొరుగు నేతలకు భజనలు చేస్తుంటే వారి పార్టీ నాయకుడు ఒకడుగు ముందుకువేసి అక్కడినుంచి వచ్చినోళ్లు మనకు సాగు నేర్పారంటూ బాకాలూదే స్థాయికి దిగజారిపోయారు. ఇది ఈ గడ్డ బిడ్డలకు ఏ మాత్రం మింగుడుపడే వ్యవహారం కాదు.