దేశంలో జనగణనకు గంట మోగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి పదహారేండ్ల అసాధారణమైన విరామం తర్వాత మనుషుల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఈసారి జనగణనకు ఎన్నో రకాలుగా ప్రాముఖ్యం ఉన్నది. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది జనగణనతో పాటే కులగణన జరుపడం. 1931లో బ్రిటిష్ పాలనలో చివరిసారిగా కులగణన జరిగింది. అనంతరం ఇక ఇప్పుడు సుమారు 90 ఏండ్ల తర్వాత జనాభాలో ఏ కులం వాటా ఎంతనేది తేలబోతున్నది. దళితబహుజన వర్గాలు కులగణన జరపాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ‘అధికారంలో మా వాటా మాకు కావాలి.. అందుకు కులగణనే ఏకైక మార్గం’ అనేది దీని వెనుక ఉన్న ఆలోచన. కులాలవారీగా లెక్కింపు జరిపితే కులతత్వం పెరిగిపోతుందని అనేవారూ ఉండవచ్చు. కానీ, సామాజిక న్యాయానికి కులగణన తప్పనిసరని చెప్పక తప్పదు. లెక్కలు తీయకుండా అసమానతను సరిదిద్దలేరనేది సామాజిక శాస్త్రవేత్తల వాదన. జాతీయ పార్టీలు కులగణనపై దాగుడుమూతల విధానాలు అనుసరిస్తూ దాటవేస్తూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, బీజేపీల వైఖరి గణనీయంగా మారింది. రాజకీయ అవసరాల కోసం రెండు జాతీయ పార్టీలు కులగణనకు తలూపాయనేది వాస్తవం.
ఈ సారి జనగణన కీలకమైన మలుపులో జరుగుతున్నది. 1971 జనాభా లెక్కల ఆధారంగా రూపొందించిన పార్లమెంటరీ సీట్ల సంఖ్యపై విధించిన యథాతథ స్థితి గడువు ముగియబోతున్న తరుణంలో ఇది జరుగనున్నది. ఈ లెక్కల ఆధారంగా తదుపరి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టేందుకు కేంద్రం ఉవ్విళ్లూరుతున్నది. దీనిపై దక్షిణాదిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత యాభై ఏండ్లలో ఉత్తరాదిలో జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగితే, దక్షిణాదిలో అదుపులో ఉన్న ది. కుటుంబ నియంత్రణ పథకం అమలులో ఉత్తర, దక్షిణ వ్యత్యాసాల ఫలితంగా ఇది జరిగింది. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే యూపీ బలం 100కి చేరుతుంది. దక్షిణాది 4 రాష్ర్టాల ఎంపీ స్థానాలకు ఇది దాదాపుగా సమానం. తమిళనాడు పార్లమెంటు సీట్లు 39 నుంచి 30కి, కేరళ సీట్లు 20 నుంచి 17కు కుంచించుకుపోతాయి. తనకు అనుకూలంగా స్పందించే ఉత్తరాదిలో జనాభా పెరుగుదల నుంచి లబ్ధి పొందేందుకు బీజేపీ దూకుడుగా పోతుండగా, తమిళనాడు సహా దక్షిణాది రాష్ర్టాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ సమస్యకు పరిష్కార మార్గాలు వెతకడం అంత సులభం కాదు. ప్రస్తుత ప్రాతినిధ్య శాతాలను మార్చకుండా సీట్ల సంఖ్యను 543 నుంచి 800కు పెంచడం ఓ మార్గంగా కొందరు సూచిస్తున్నారు. రాష్ర్టాల ప్రాతినిధ్యంలో సమతూకం పాటించే అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల పద్ధతి పాటిస్తే మంచిదని మరికొందరు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి జనగణన ఫలితాలు తేనెతుట్టెను కదుపుతాయని చెప్పవచ్చు. కులగణన జరిపి సామాజిక న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి జాతీయ పార్టీలకు లేదనేది స్పష్టం. మొక్కుబడి చర్యలతో, పైపై మార్పులతో సరిపెట్టేందుకే చూస్తాయనే అనుమానాలున్నాయి. అదే గనుక జరిగితే వెనుకబడిన వర్గాల స్పందన ఎలా ఉంటుందనేది ప్రశ్న. నియోజకవర్గాల్లో ఉత్తర, దక్షిణాల మధ్య భారీ వ్యత్యాసాలు ఏర్పడితే రాష్ర్టాల ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది మరో ప్రశ్న.