అవినీతి కాంగ్రెస్ పుట్టల్లోంచి కట్టలు కట్టలు పాముల్లా బయటికి వస్తున్నాయి. ఓటును కాటేసేందుకు నోటు మరోసారి బుసలు కొడుతున్నది. కాంగ్రెస్ మార్క్ ఎన్నికల కుతంత్రం, పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు రూపంలో బట్టబయలవుతున్నది. ఈ నోట్ల బారు కర్ణాటక నుంచి వస్తుండటం ఆలోచించాల్సిన విషయం. నిన్నగాక మొన్న అక్కడి ప్రజలు, ‘అతని కంటే ఇతడు ఘనుడు’ అన్నట్టుగా బీజేపీని సాగనంపి కాంగ్రెస్‌ను నెత్తికెత్తుకున్నారు. బీజేపీ మత విద్వేష విధానాలు, అలవిమాలిన అవినీతి అందుకు కారణం. పాపం… వేరే ప్రత్యామ్నాయం లేక వారు ‘హస్తగతమై’పోయారు.
వచ్చి 4 నెలలు కాకముందే ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి గంగలో కలిపిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు, అవినీతిలో ఇక ఇప్పుడు బీజేపీ కన్నా ఒక ఆకు ఎక్కువే చదివారు. కమలం పార్టీ కమిషన్ 40 శాతమైతే కాంగ్రెస్ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తలు కర్ణాటక వారేనంటున్నారు. అందుకే డబ్బులూ అక్కడినుంచి వస్తున్నట్టు భావించాలేమో! కర్ణాటక మాడల్ ఇక్కడా కాపీ చేస్తామని దింపుడుకల్లం ఆశలు పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుల దగ్గర కాపర్స్ తప్ప కరెన్సీ లేనట్టుంది. అందుకే కరెన్సీ కూడా అక్కడినుంచే తెచ్చుకుంటున్నట్టు కనిపిస్తున్నది. బెంగళూరులో గత మూడురోజులుగా ఐటీ దాడుల్లో 90 కోట్ల రూపాయలు దొరకడం, పట్టుబడ్డ వారంతా కాంగ్రెస్ నేతలే కావడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది.
మోసపోతే గోస పడుతమని కర్ణాటక ప్రజల అవస్థల సాక్షిగా తెలంగాణ ఓటరుకు అర్థమైపోతున్నది. అక్కడ ఐదు హామీలు అమలుచేయలేక చతికిలపడ్డవారు ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని ఎగురుతున్నారు. స్కాంగ్రెస్ మార్కు అవినీతిలో మునిగితేలుతున్నారు. కేంద్రం పైసా ఇవ్వకపోయినా భారీ ఖర్చుతో, పెద్దపెద్ద ప్రాజెక్టులు కట్టుకున్నా అవినీతి కంపు మనకు చుట్టుకోలేదు. ఇగురంతో సాగించిన పాలనపై విపక్షాలు పబ్బం గడుపుకొనేందుకు చేసే గబ్బు ఆరోపణల మాటేముంది? వాటికి సాక్ష్యాలు, రుజువులు అడగొద్దు. అలాంటి ఊకదంపుడు తప్ప ఏ కాంట్రాక్టర్ అయినా నన్ను ఫలానా వారు కమిషన్ అడిగారని ఆరోపించిన ఉదంతం తెలంగాణలో ఒక్కటైనా ఉందా!
ఎన్నికల హామీలను గ్యారంటీలంటూ నమ్మబలికేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఒక్క చాన్స్ అంటూ ఓటరు వెంట పడుతున్నది. కర్ణాటక మాడల్‌ను దేశమంతా నింపేయాలని ఆరాటపడుతున్నది. అమలు చేయలేని హమీలను నమ్మి తెలంగాణ ‘చే’జిక్కితే అంతే సంగతులు. తెలంగాణ ఓటరును తేరగా కొనేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆడలేక మద్దెల ఓడన్నట్టు గెలవలేక నోట్లు బయటికి తీస్తున్నవారికి పొరపాటున అధికారమిస్తే ఏం చేస్తరో తెలియనంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరు. అయినా అజాగ్రత్త పనికి రాదు. ఆదమరిస్తే అంతే సంగతులని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు హెచ్చరించారో వారికి తెలుసు. కాసులు విసిరి ఓటు లాగేసుకోవాలని చూసేవారికి సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ చెప్తున్న కర్ణాటక మాడల్ అంటే గెలుపు కాదు. తెలంగాణ సంపదను దోచుకునే అవినీతి!