స్కాముల స్వాములు వచ్చారు ఇక వాముల కొద్దీ అవినీతి చూడక తప్పని రోజులు వచ్చాయి. స్వాతంత్య్రం తర్వాత పాలనా పగ్గాలు కాంగ్రెస్ చేపట్టడంతో అధికారం, అవినీతి చెట్టపట్టాలేసుకొని సాగడం మొదలైంది. నెహ్రూ హయాంలో అంతంత మాత్రంగా ఉన్న అవినీతి ఇందిరా గాంధీ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఒకరకంగా ఇందిరమ్మ రాజ్యం అవినీతికి పర్యాయపదంగా మారిపోయింది. ముడుపులు పుచ్చుకోవడమనేది విశ్వజనీన సంస్కృతి అని ఆమె అడ్డంగా సమర్థించుకున్నారు కూడా.
రాజీవ్ గాంధీ హయాంలో ప్రభుత్వాన్ని ఓడించే ఆయుధంగా అవినీతి మారడం తెలిసిందే. సౌమ్యుడు, మచ్చలేని వాడు, అన్నిటికీ మించి నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వాడైన ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ పాలనలోనూ అవినీతి ఊడలు దిగడం మనం చూశాం. టూజీ, బొగ్గు స్కాంలతో స్కాంగ్రెస్ అనే మారు పేరును సార్థకం చేసుకున్నది అతివృద్ధ పార్టీ. ఈ సంస్కృతిని, వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేమేం తక్కువ తిన్నామా అంటూ పేరు నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్టే కనిపిస్తున్నది. రోజురోజుకూ బయటపడుతున్న కుంభకోణాలే అందుకు నిదర్శనం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అన్ని స్థాయుల్లో అవినీతి అల్లుకుపోతున్నది.
పిల్లి నల్లదైతేనేం, తెల్లదైతేనేం ఎలుకల్ని పడితే చాలు కదా అన్నట్టుంది సీఎం రేవంత్ ధోరణి. తాను ఆంధ్రా కంపెనీ, అరాచక కంపెనీ అని తిట్టిపోసిన ఓ సంస్థకు ఇప్పుడు మనసు మార్చుకొని మూసీ ప్రాజెక్టు ఎందుకు కట్టబెట్టారో ఆయన చెప్పాల్సి ఉన్నది. ‘నిన్నటి ఈస్టిండియా కంపెనీ నేటి బెస్టిండియా కంపెనీగా మారిందా?’ అనేది ప్రశ్న. అటు బీజేపీ వాళ్లు సన్నాయి నొక్కులతో సరిపెడుతుండటం విడ్డూరం. ప్రాజెక్టుల వ్యయాలు పెంచేయడం అనుమానాలను మరింత బలపరుస్తున్నది. కాళేశ్వరం నీళ్లు మూసీకి గండిపేట ద్వారా మళ్లించే ప్రాజెక్టు వ్యయం తిప్పి తిప్పి కొడితే రూ.1100 కోట్లు కూడా కాదు. కానీ, సర్కార్ రూ.5,500 కోట్లుగా ఖరారు చేసింది.
ఇక సుందరీకరణ కాదు, పునర్నవీకరణ అంటూ తలపెట్టిన మూసీ ప్రాజెక్టుకైతే లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారట. రూ.70-80 వేల కోట్లతో రాష్ర్టానికి జలకళ తెచ్చిన కాళేశ్వరంపై లక్ష కోట్ల అవినీతి అంటూ కండ్లల్ల నిప్పులు పోసుకున్నవారు ఇంత లేసి ఖర్చు చేసేది దేనికో ఇప్పటికీ స్పష్టత రాలేదు. కొత్తగా ఎక్కడన్నా తాగునీరో, సాగునీరో ఇస్తారా అంటే ఇదమిద్ధంగా ఏమీ చెప్పడం లేదు. కాంగ్రెస్ పాలకుల మూసీ అంకెల సంబురం చూస్తుంటే అప్పుడే అవినీతి మురికి కంపు కొడుతున్నది. టెండర్లు పిలవకుండానే ఒప్పందాలు జరిగిపోవడం ఆ సంగతినే పట్టిస్తున్నది. ఇక కొడంగల్ ఎత్తిపోతల్లో పేరున్న బయటి కంపెనీలను కాదని ‘మన వాళ్లకు’ ధారపోస్తుండటం గమనార్హం. మంత్రికి చెందిన కంపెనీకి ప్రాజెక్టులు అప్పగించడం అనైతికం ఎందుకు కాదో కాంగ్రెస్ సర్కార్ పెద్దలే చెప్పాలి.
అధికారానికి దూరమై అర్రులు చాస్తున్న కాంగ్రెస్‌కు ముందుగా కర్ణాటక, తర్వాత తెలంగాణ రాష్ర్టాలు చేజిక్కాయి. ఈ రెండు రాష్ర్టాలు ప్రస్తుతం ఆ పార్టీకి రూపాయలు పిండుకునే ఏటీఎంలుగా మారాయి. ఫలితంగా రెండు రాష్ర్టాలు కుంభకోణాల కుప్పలుగా మారాయి. గిరిజన కార్పొరేషన్ నిధులను కర్ణాటక సర్కారు గోల్మాల్ చేసి తన డీఎన్ఏను గొప్పగా చాటుకున్నది. కానీ, రాహుల్‌తో సహా కాంగ్రెస్ అధిష్ఠానం అలాంటివి చూసీచూడనట్టు పోతున్నది. ఢిల్లీలో అదానీపై రాహుల్ అంతెత్తు ఎగురుతున్నట్టు కనిపిస్తారు. కానీ, అదే అదానీకి ఇక్కడ రాచమర్యాదలు జరుగుతాయి.
రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారు. మరోవైపు కేంద్ర బీజేపీ నాయకత్వాన్నీ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ప్రసన్నం చేసుకొని పనులు వెళ్లదీసుకుంటున్న సూచనలూ కనిపిస్తున్నాయి. ఈడీ దాడుల సమాచారం బయటకు రాకుండా చూసుకుంటున్నారంటే వారి ప్రతిభా సామర్థ్యాలకు జోహార్లు అర్పించాల్సిందే. ఇలా ఏక కాలంలో జోడు గుర్రాల స్వారీ చేయడం వారికే చెల్లింది. కానీ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రైతులు, విద్యార్థులు, చివరికి పోలీసులు కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. కానీ, కాంగ్రెస్ పెద్దలు కాసుల వేటలో, సూట్‌కేసుల మోతలో తలమునకలుగా ఉన్నారు. తెలంగాణలో దక్కించుకున్న ఒక్క అవకాశం కూడా దేశమంతటా జరిగినట్టుగానే చివరి అవకాశంగా మారుతుందనే మాట ప్రజల నుంచి బలంగానే వినిపిస్తున్నది. ఎందుకంటే తెలిసో తెలియకో అధికారాన్ని చేతుల్లో పెట్టింది వారేనని గుర్తుంచుకుంటే మంచిది.