‘ఏం చేస్తున్నావు కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా’ అన్నదట. గత రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన అంతా ఇదే తీరుగా సాగుతున్నది. తప్పులు చేయడం, కోర్టులు మొట్టికాయలు వేయడమో, ప్రజాగ్రహం పెల్లుబుకడమో జరిగితే దిద్దుబాట పట్టడం సాధారణమైపోయింది. తాజాగా తెరపైకి వచ్చిన 22-ఏ వివాదం అందుకు నిలువెత్తు నిదర్శనం. దీనిని వివాదం అనడం కన్నా ప్రజల జీవితాలతో చెలగాటంగానే చూడాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో 22-ఏ సృష్టించిన కల్లోలం ఇంతా అంతా కాదు. ఇప్పటికే హైడ్రా వంటి దుందుడుకు, దుస్సాహసిక విధానాలతో సర్కార్ రియల్ వ్యాపారాన్ని కుప్పకూల్చింది. ఎక్కడ ప్లాటు కొనాలన్నా, ఫ్లాటు బుక్ చేయాలన్నా గుబులే అనే పరిస్థితి తెచ్చింది. అక్రమ నిర్మాణాల పేరిట యంత్రభూతాలు పేదల ఇండ్లపై చేస్తున్న కరాళనృత్యం కొనుగోలుదార్లను భయభ్రాంతులను చేసింది. స్వరాష్ట్ర సాధన తర్వాత కళకళలాడిన రియల్ రంగం ఇప్పుడు మూలన పడి మూలుగుతున్నది. దానికి తోడైన 22-ఏ సంక్షోభం ఆ రంగాన్ని చావుదెబ్బ తీసింది. చిన్నచెక్క సర్కారీ భూమి ఉంటే యావత్తు సర్వే నంబరును నిషేధిత జాబితాలో తోసేయడం వల్ల తలెత్తిన సమస్య ఇది.
రిజిస్ట్రేషన్‌కు వెళ్లిన అనేకమందికి సదరు ఆస్తి నిషేధిత జాబితాలో ఉన్నట్టు కంప్యూటర్ ఎర్రగుర్తు చూపడంతో దిక్కుతోచని స్థితి. ఈ ఎర్రగుర్తులున్న సర్వే నంబర్లకు రిజిస్ట్రేషన్లు చేసేందుకు సబ్ -రిజిస్ట్రార్లు నిరాకరిస్తున్నారు. అధికారులు చేతులెత్తేస్తుంటే సర్కార్ పొంతన లేని ప్రకటనలతో గందరగోళాన్ని పెంచుతున్నది. ప్రభుత్వం కలగాపులగంగా భూముల వివరాలు ఆన్లైన్ చేయడంతో అవి తప్పులతడకలుగా మారి సాంకేతిక సమస్యలు సృష్టిస్తున్నాయి. పిల్లల చదువుల కోసమో, పెండ్లిళ్ల కోసమో అమ్మేసుకుందామని వెళ్లిన సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొనుగోలుదార్లకు ఏ ఆస్తి నిషేధిత జాబితాలో ఉన్నదో తెలియని పరిస్థితి. అసలే అంతంతమాత్రంగా ఉన్న రిజిస్ట్రేషన్లు అడుగంటిపోయాయి. మొన్నటిదాకా ప్రధానంగా రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలకు పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు జిల్లాలకు పాకినట్టు కనిపిస్తున్నది. ఈలోగా సర్కార్ రోజుకోరకం కుప్పిగంతులు వేస్తున్నది. అధికారులపైకి నెపం నెడుతున్నది. ఈలోగా రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. బ్యాంకు రుణాలు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంత జరుగుతున్నా సర్కార్ మాత్రం రైల్వే అనౌన్స్మెంట్ తరహాలో అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ సారీలతో సరిపెడుతున్నది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన 22-ఏ టోల్ ఫ్రీ నంబరులో ఇప్పటికే వందలాదిగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే దాదాపు వెయ్యి ఫిర్యాదులు నమోదయ్యాయి. నిషేధిత జాబితా ప్రక్షాళన వేగంగా చేపట్టినట్టు ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. ముందుగా చితకబాది, ఆపై క్షమాపణలు చెప్పి, తాపీగా మలాము రాస్తున్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ ధోరణి. ఇది కేవలం అసమర్థత వల్ల జరిగిన అనర్థమని అనుకోవడానికి వీల్లేదు. భారీ స్థాయిలో కింది నుంచి పైస్థాయి దాకా అవినీతికి ద్వారాలు తెరిచేందుకే ఈ సమస్య కావాలని సృష్టించారని విపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగాలి. వారు ప్రసన్నులైతేనే భూమికి మోక్షం. ఫిర్యాదు చేయాలి. తర్వాత పత్రాలు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత అధికారులను కలుసుకోవాలి. తమ భూమి తమదేనని రుజువు చేసుకునేందుకు ఈ తతంగమంతా చేయడమే కాకుండా అధికారుల చేతులు తడపాల్సి వస్తున్నదని బాధితులు వాపోతున్నారు. పెద్దగా సమస్య లేదన్నట్టుగా మాట్లాడుతూనే, యుద్ధప్రాతిపదికపై దిద్దుబాట్లు చేపడుతున్నట్టు చెప్పడం తిరకాసు కాక మరేమిటి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూముల మీదే తదేక దృష్టి నిలుపడం తెలిసిందే.
సర్కారీ భూముల వేటలో సామాన్యులు సమిధలవుతుడటం విచారకరం. ప్రైవేట్ భూములు అలా నిషేధిత జాబితాకెక్కడానికి ఎవరు బాధ్యులు? అధికారులా, మంత్రులా? ఈసరికే ప్రజలు అనుభవించిన క్షోభకు ఎవరు జవాబుదారీ వహిస్తారు? అనేది ప్రశ్న. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి నిగ్గుతేల్చాలి. అలా చేయకపోతే పాలకుల దగ్గర దాచాల్సింది చాలానే ఉన్నట్టు భావించాల్సి వస్తుంది.