సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - Aug 06, 2020 , 00:20:14

సంస్కరణల పథగామి

సంస్కరణల పథగామి

పీవీ భిన్నాభిప్రాయాలను గౌరవించే కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికారు. స్వార్థం కంటే జాతీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక సమావేశంలో ఓ పత్రిక విలేకరి మీరు కలుషితమైన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అని పీవీ గారిని వినయంగా అడిగారు. ‘తుదిలేని రంగం కావటం, ఎంత చేసినా ఇంకా ఎంతో చేయాల్సి ఉండే పని, బాధ్యతను కలిగించే రంగం కాబట్టి’ అని సమాధానమిచ్చి రాజకీయాల ఔన్నత్యాన్ని చాటిచెప్పారు.

ఈశతాబ్దంలో తెలుగువారు గర్వించదగిన ఏకైక నాయకుడు, మార్గదర్శకుడు మన పాములపర్తి వెంకట నరసింహారావు. ఇందిరాగాంధీ అంతటి నాయకురాలు పార్టీ విషయాలలో, పాలనా అంశాల్లో పీవీ సలహాలు తీసుకునేది. అనంతర కాలంలో రాజీవ్‌గాంధీ కూడా. పీవీ అరవై ఏండ్లు రాజకీయ నాయకుడిగా మనగలిగారు. ఆయన ఏ పదవిని ఆశించలేదు. పదవే ఆయనను వరించింది. ఏ పదవిలో ఉన్నా తనను తాను కార్యకర్తగానో, సేవకునిగానో భావించుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడుగా పేరుపడ్డ పీవీ నిజానికి మొదటినుంచీ సంస్కరణల పథగామి.

రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కాలంలోనే పీవీ అనేక అభివృద్ధి పనులు, సంస్కరణలు చేపట్టారు. మంథని నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఆ ప్రాంతానికి బొక్కలవాగుపై బ్రిడ్జి, తూర్పు అటవీ ప్రాంతాన్ని కలిపే మానేరునదిపై వంతెన నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో న్యాయశాఖతోపాటు జైళ్ళశాఖ బాధ్యతలు నిర్వహించిన ఆయన ‘ఓపెన్‌ జైలు’ పద్ధతిని, ఖైదీల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టారు. దేవాదాయ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ చారిటబుల్‌ అండ్‌ హిందూ రెలిజియస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ యాక్ట్‌ అనే సమగ్రమైన చట్టం తెచ్చిన ఘనత పీవీ గారిది.

రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా (1967) ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీసు మానుకోవాలని పీవీ ఆదేశించారు. గర్భవతులైన గ్రామీణ పేదలకు సత్వర వైద్యసదుపాయం అందేలా ఆరోగ్య కార్యకర్తలను ఏర్పాటు చేశారు. కలరా, మశూచి, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించినప్పుడు ‘వాక్సినేషన్‌' విధానం పట్ల అప్పటి ప్రజలకున్న అపోహలను తొలగించి, శాస్త్రీయమైన అవగాహన కలిగించటంలో ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విద్యామంత్రిగా పీవీ సంస్కరణలు ఎనలేనివి. విద్యార్థి ప్రతిభను గణించేందుకు ఒక వార్షిక పరీక్షలే మార్కులే కొలమానం కాకూడదని, ఏడాది పొడవునా యూనిట్‌ పరీక్షలు, అర్ధ సంవత్సర వారీగా నిర్ధారించాలని నాన్‌ డిటెన్షనను సూత్రీకరించింది పీవీయే. విద్యాశాఖమంత్రిగా లైబ్రరీస్‌ కమెండ్‌ మెంట్‌ బిల్‌ ప్రవేశపెట్టడం వల్ల జిల్లా గ్రంథాలయ సంస్థలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించింది మొత్తం 14 నెలలు మాత్రమే. అయినా ఆయన పరిపాలన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపైన చెరగని ముద్ర వేసింది. 1972 ఆగస్టు 30న పీవీ అసెంబ్లీ లో చరిత్రాత్మక భూసంస్కరణల బిల్లును ప్రవేశపెట్టారు. 

పీవీ ఆ తర్వాత 1977లో హన్మకొండ పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. విదేశాంగ నిర్వహణలో రాజనీతి చతురుడిగా సమస్యల పట్ల సమయస్ఫూర్తితో వ్యవహరించారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో రక్షణ శాఖామంత్రిగా, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా యువ ప్రధాని ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు. భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళేందుకు అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులను, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధనకు రాజీవ్‌ గాంధీకి సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఈ ప్రయత్నంలో తొలిసారిగా సృజించిన విభాగమే మానవ వనరుల అభివృద్ధిశాఖ. విద్యాపరంగా 1986లో ‘నూతన విద్యావిధానం’ రూపొందించి మౌలికమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జవహర్‌ నవోదయ విద్యాసంస్థలను స్థాపించి మారుమూల గ్రామ ప్రాంతాల్లో నివసించే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అవకాశం కల్పించారు.

1991 మే 21న రాజీవ్‌గాంధీ అకాల మరణంతో పీవీ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని కాగానే రాబోయే రోజులకు అనుగుణమైన ప్రణాళికలు, సంస్కరణలు రూపొందించారు. ఆ తర్వాత సంస్కరణల పథం తెలిసిందే. ‘ఎంపీ-లాడ్‌'ను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ, మున్సిపాలిటీల్లో 33శాతం సీట్లను మహిళలకు రిజర్వు చేయించారు. పీవీ భిన్నాభిప్రాయాలను గౌరవించే కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికారు. స్వార్థం కంటే జాతీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధా న్యం ఇచ్చారు. ఒక సమావేశంలో ఓ పత్రిక విలేకరి మీరు కలుషితమైన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అని పీవీ గారిని వినయంగా అడిగారు. ‘తుదిలేని రంగం కావటం, ఎంత చేసినా ఇంకా ఎంతో చేయాల్సి ఉండే పని, బాధ్యతను కలిగించే రంగం కాబట్టి’ అని సమాధానమిచ్చి రాజకీయాల ఔన్నత్యాన్ని చాటిచెప్పారు.


logo