శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Apr 17, 2020 , 09:03:39

కన్నీటి పిచికారీ

కన్నీటి పిచికారీ

జనసంచారం లేక ఘనీభవించిన వీధుల్లో

మనిషి కన్నీటిని పిచికారీ చేస్తున్నాడు

కన్నీరిప్పుడు హైడ్రాక్సి క్లోరోక్విన్‌..!

అన్ని ఆశల్ని పక్కకు నెట్టి

మనిషిప్పుడు

మరో మనిషి గురించి ఆలోచిస్తున్నాడు

మనిషితనంతో మెలుగుతున్నాడు

భాగ్యవంతుడు కాకున్నా

అభాగ్యుడికి వారానికి సరిపడా ప్రేమను

సరుకు సంచీలో అందిస్తున్నాడు..!

ప్రాధాన్య పట్టికలో

మార్కెట్‌ సూచీలో

మనిషి అగ్రస్థానానికి

ఎగబాకాడు!

మనుషులుగా దూరంగా ఉన్నా

మనసులు ఏకమవుతున్న

అపురూప సందర్భం.

మానవత్వం

మనిషిరూపు దాల్చడం 

మొదలుపెట్టింది

దైవత్వం కొత్త రూపాలు ధరిస్తోంది

తెల్లకోటు వేసుకొని 

పోయే ప్రాణాలకు అరచేతిని

అడ్డుపెడుతోంది

ఖాకీ బట్టలేసుకుని

కంటికిరెప్పలా కాపాడుకుంటోంది

సఫాయి కర్మచారియై

వీధిరాతను, విధిరాతను

శుభ్రం చేస్తోంది..!

కాలం ఆటుపోట్లను 

విసురుతూనే ఉంటుంది

సహనంతో ఎదుర్కోవడమే

సిసలైన విజయం

పంజా విసిరే పులికి

అందకుండా దాక్కోవడమే

అసలైన విజ్ఞత...

రాపోలు సీతారామరాజు (దక్షిణాఫ్రికా నుంచి..)


logo