సోమవారం 06 ఏప్రిల్ 2020
Editorial - Feb 16, 2020 , 22:55:55

లోకమంత మనసుతో..

లోకమంత మనసుతో..

అప్పుడో ఇప్పుడో

ఒకసారి

ఒక పద్యంలో చివరి

వాక్యంలానో..

ఒక చిన్న పదంలానో

మెరవాలి!

మొదలో చివరో

ఒక్క వెలుగైనా వెలగాలి

ఏదో ఒక తళం

తళుక్కుమనాలి

ఎర్రెర్రని మిరప పండు

నునుపులానో

లేత చిగురు దోర ఎరుపులానో..

మనిషి మెరవాలి..!

అసలు సిసలు పాటేదో

పాడాలి

అప్పుడే వెలిగించిన

దీపంలానో

ఆరిపోయే ముందటి

కాంతిలానో

చెకుముకి రాయిని

రాపాడిస్తే వచ్చే నిప్పు రవ్వలానో..

నీవు వెలగాలి..!

మిణుకుమిణుకు మంటూనైనా

నీ ఉనికి చాటాలి

గంప కింది కోడిలానో

కొమ్మమీది కోయిల పిల్లలానో

కూత పెట్టాలి..!

ఒక నీటి పక్షి

బుడుంగు మంటూ నీళ్ళల్లో

మునిగిన చప్పుడైనా చెయ్యాలి

కవికి లోకానికి పొసగదు

స్వప్నలోకాన్ని ఆవిష్కరించే వాడ్ని

లోకం నమ్మదు

కాలో చెయ్యో కూడదీసుకుని

కాసిన్ని పుల్లలేరుకోవాలి...

- సుంకర రమేశ్‌, 94921 80764


logo