హాలియా, ఏప్రిల్ 3 : యువత ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని, ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగ లక్ష్యాన్ని సాధించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాలియాలోని చైతన్య ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ అవగాహన, స్క్రీనింగ్ టెస్టుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. గడిచిన ఏడేండ్లలో కోట్లాది రూపాయల నిధులతో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకుని సాగునీరు సాధించుకున్నామని, ఇక నియామకాల దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం మరో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లను సిద్ధం చేస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన యువతీ యువకులు ప్రిపరేషన్ కోసం దూరప్రాంతాలకు వెళ్లి, డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా నోముల నర్సింహయ్య జ్ఞాపకార్థం నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను హాలియాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ సలహాదారుడు వెంపటి శంకరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, సత్యపాల్, నరేందర్, రవినాయక్, పిడిగం నాగయ్య పాల్గొన్నారు.
త్వరలో గ్రూప్ 1 మొదలుకొని గ్రూప్ 4 వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్హతకు అనుగుణంగా ఉద్యోగాన్ని ఎంచుకుని అందుకు ప్రిపేర్ కావాలి. ఏ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారో ముందుగానే స్పష్టత ఉండాలి. ఆ తర్వాత పూర్తిస్థాయిలో మెటీరియల్ సంపాదించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం గ్యారెంటీ.
– డి.హన్మంతునాయక్, సోషల్ వెల్ఫేర్ సొసైటీ
ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తన తండ్రి, దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య జ్ఞాపకార్థం నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయం. నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగం సాధించేలా ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం ఈ ప్రాంత పేదలకు వరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలి.
– సురేశ్‌కుమార్, హాలియా, సీఐ
అన్నదానం చేస్తే ఆ పూటే కడుపు నిండుతుంది. కానీ అక్షరదానం చేస్తే ఆ ఇంటి నిండా వెలుగులు నిండుతాయి. నోముల ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం.
– గౌరీ నాయుడు, సీఐ, నాగార్జునసాగర్