కామారెడ్డి, జనవరి 7: భిక్కనూర్ మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ నాయకుడు బండమీది సాయాగౌడ్తోపాటు మరో వ్యక్తి తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ కాచాపూర్ గ్రామానికి చెందిన గోనుగొప్పుల రాజేందర్ (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మృతుడి తండ్రి చిన్నబాల్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 490లో ఉన్న 10గుంటల భూమిలో 35 ఏండ్ల నుంచి చిన్న బాల్‌రాజు కబ్జాలో ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన ఎర్ర బాలయ్య.. చిన్నబాల్రాజుకు చెందిన భూమిని మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ నాయకుడు బండమీది సాయాగౌడ్‌కు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. ఈ విషయమై చిన్నబాల్రాజు వెంటనే సాయాగౌడ్ ఇంటికి వెళ్లి భూమి కొలతలు చేసుకుందామని చెప్పివచ్చాడు. కొలతలకు ఎర్ర బాలయ్య, సాయాగౌడ్ రాలేదు. ఈ నెల 3వ తేదీన భూమిని చిన్నబాల్రాజ్ కుటుంబ సభ్యులు ట్రాక్టర్‌తో దున్నుతుండగా సాయాగౌడ్ వచ్చి ఇది తన భూమి అని, ఎందుకు దున్నుతున్నారంటూ అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గోనుగొప్పుల రాజేందర్ ఇంటికి వచ్చి గడ్డిమందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్సులో కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తండ్రి చిన్న బాల్‌రాజు తెలిపాడు. తమ భూమిని అకారణంగా లాక్కున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భిక్కనూర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.