
సాగుకు సరైన నిర్వచనం చెప్తూ,, అన్నదాతకు ఊతంగా నిలుస్తున్న గొప్ప పథకం రైతు బంధు. యావత్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వమే పంటకు పెట్టుబడి పెడుతుండడంపై రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రైతన్న బాగు కోసం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయన ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఎనిమిది విడుతలుగా నిర్విఘ్నంగా సాగుతున్న రైతు బంధు సాయం ఈ నెల పదితో రూ.50వేల కోట్లను చేరుతుండగా, ఉమ్మడి జిల్లాలో ఆ మొత్తం రూ.7,860 కోట్లు కానున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చిన పథకం, ఈ అరుదైన సందర్భం చరిత్రలో నిలిచిపోయేలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వారోత్సవాల్లో భాగంగా సోమవారం భువనగిరి, వలిగొండ, బీబీనగర్, గుండాల తదితర మండలాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు టీఆర్ఎస్ నాయకులతో రైతులు క్షీరాభిషేకం చేశారు. వలిగొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. గుండాల
మండలంలోని వస్తాకొండూర్ గ్రామంలో రైతు దొడ్డి భీమేశ్ తన వరి నారుమడిలో సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
రైతు బంధు సాయం రూ.50వేల కోట్ల మైలురాయిని దాటుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం రైతు బంధు వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరూరా పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. చాలాచోట్ల సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. కొన్నిచోట్ల రైతులు పొలాల వద్దనే సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేం చేసి తమకు సాయపడుతున్న సందర్భాన్ని మననం చేసుకున్నారు. నవ తరాన్ని సైతం సాగువైపు మళ్లించేలా రైతు బంధు పథకం స్ఫూర్తినిస్తున్నదని ప్రశంసలు కురిపించారు. భువనగిరి మండలం వలిగొండలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ కొలుపుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ మండలాల్లో జరిగిన సంబురాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ గ్రామ, పట్టణ శాఖలు, రైతు బంధు సమితి, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. వారం రోజులపాటు నిర్వహించనున్న వారోత్సవాల్లో.. చెరుగని ముద్ర వేసిన ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్
వలిగొండ, జనవరి 3 :అన్నదాతల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తున్న రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలో రైతు బంధు సంబురాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు కల్గిస్తున్నా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అనేక పథకాలను అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కలుపుల అమరేందర్, పీఎసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, మత్స్యాద్రి చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ కునపురి కవిత, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, ఎంపీటీసీ పల్సం రమేశ్, పార్టీ మహిళా అధ్యక్షురాలు మద్దెల మంజుల, పట్టణ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి, మామిండ్ల రత్నయ్య, అయిటిపాముల రవీంద్ర, మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
అంబరాన్నంటేలా వారోత్సవాలు
ఈ నెల 10 వరకు నిర్వహించనున్న రైతు బంధు వారోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు కార్యాచరణను రూపొందించుకుని విజయవంతంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలను నిర్వహించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటిముందు మహిళలు రైతు బంధు సంబంధిత ముగ్గులను వేసేలా చైతన్యపర్చనున్నారు. రైతు వేదికల వద్ద ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించడంతోపాటు, సంబురాల చివరి రోజున ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపుల వంటి కార్యక్రమాలు నిర్వహించి రైతు బంధు పథకానికి విస్తృత ప్రచారంకల్పించనున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి వారోత్సవాలను దిగ్విజయం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇందులో రైతులను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేసి పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు సాయం రూ.1,937కోట్లు..
ప్రతి సీజన్లో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అందిస్తున్న రైతు బంధు సాయంతో రైతన్నలు మురిసిపోతున్నారు. సేటు దగ్గరకు పోయి చెయ్యి చాపే పరిస్థితులకు చరమగీతం పాడిన రైతు బంధు పథకాన్ని ప్రతి రైతూ కుటుంబం వేన్నోళ్లా పొగుడుతున్నది. ఏటా పంటల సాగు కోసం రైతన్నలు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. తొలకరి జల్లులు కురిసింది మొదలు.. దుక్కులు దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం రైతులకు పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగు బాట పట్టాల్సి వచ్చేది. ఈ కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకు సీఎ కేసీఆర్ రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. రైతుల కష్టాలను దూరం చేసి వారి మోముల్లో చిరునవ్వులు చిందించేందుకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. 2018 వానకాలం సాగు నుంచి ఏటా రూ.8వేల సాయం అందించగా..2019 వానకాలం సీజన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం సాయాన్ని రూ.10వేలకు పెంచింది. రైతన్నలకు ఆత్మబంధువుగా నిలుస్తున్న రైతు బంధు పథకాన్ని సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తున్నది. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ప్రస్తుత యాసంగి సాగుకు సైతం సాయం అందించి రైతులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే ఏడు విడుతల్లో నిర్విఘ్నంగా సాయం ప్రక్రియను కొనసాగించిన తెలంగాణ ప్రభుత్వం 8వ విడుతలో యాసంగి సాగుకు 2,43,396 మంది రైతులకు రూ.302.02కోట్ల రైతు బంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఎనిమిది విడుతల్లో 17 లక్షలకు పైగా రైతులకు రూ.1,937 కోట్ల సాయం రైతు ఖాతాల్లో జమ అవుతున్న నేపథ్యంలో రైతు వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
పంట పొలాల్లో
గుండాల : మండలంలోని వస్తా కొండూర్‌లో సోమవారం రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. రైతు దొడ్డి భీమేశ్‌కు చెందిన పంట పొలాల్లో వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అన్నదాతల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ నల్లు ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వీరమల్ల సోమన్న, నాయకులు ఇందిరాల శ్రీనివాస్, మహేశ్వరం శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, రాజు, శ్రీను, శ్రీకాంత్, రైతులు రాజమ్మ, పద్మ, అనూరాధ, మంజుల, సోమలక్ష్మి, వెంకటేశ్ పాల్గొన్నారు.
పడావు పెట్టుడే లేదు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు అన్ని విధాలా మంచి చేస్తుండు. గతంలో నీళ్లు, కరంట్ లేక భూములన్నీ బీడుగా ఉండేవి. నాకు పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అంతకుముందు పెట్టుబడి పెట్టలేక సగం భూమి పడావు పెట్టేది. ఇప్పుడు మొత్తం భూమి సాగు చేస్తున్నా. నాకు సీజన్‌కు 50 వేల రూపాయల రైతు బంధు డబ్బులు వస్తున్నయ్. ఇప్పటికి ఐదు సార్లు వచ్చినయ్. ఆ పైసలతోనే రెండు బోర్లు వేసి పైపులైన్ ఏర్పాటు చేసుకున్నా. వ్యవసాయ పెట్టుబడులకు ఎవరి దగ్గరికి వెళ్లకుండానే రైతు బంధు పైసలే సరిపోతున్నయ్. ఇప్పుడు నేను ఇబ్బంది లేకుండా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్న. శానా మంది రైతులకు రైతు బంధు పథకం ఎంతో ఉపయోగపడుతున్నది.
-ఎస్కే కమాల్, కాశివారిగూడెం, తిప్పర్తి
వేడుకలను ఘనంగా నిర్వహించాలి
కట్టంగూర్(నకిరేకల్) : రైతు బంధు సంబురాలను నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. ఈ నెల 7 వరకు రైతుబంధుపై విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, 8 నుంచి 9వ తేదీల్లో ముగ్గుల పోటీలు, 10న ప్రతిగ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించాలని తెలిపారు. రైతు వేదికల వద్ద పండుగ వాతావరణంలో ముగింపు సంబురాలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కొవిడ్ నిబంధనలు, పరిమితులకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు సూచించారు. .
పంట ఇంటి దాకా వస్తున్నదంటే రైతు బంధు పుణ్యమే..
నాకు ఆత్మకూరులో రెండున్నరాల భూమి ఉంది. మొదటి నుంచి ఎవుసమే జేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం రాక ముందు ఎవుసాన్ని ఎక్కిరించిన ముఖ్యమంత్రులను తప్ప ఆసరా అయిన నాయకుడ్ని చూడలే. రైతు గోసతెలిసిన కేసీఆర్ సారు నాలాంటి ఎందరికో దేవుడిలెక్క దన్నుగా నిలుస్తున్నడు. రైతుబంధు మొదలైన కాన్నుంచి ఫస్ట్ సీజన్ తప్పించి, ప్రతిసారీ పంట పెట్టుబడి అందింది. ఆ డబ్బులను కూడబెట్టి, ఇంకొన్ని కలేసి ఏడాది కింద ఓ బర్రెను కొన్నా. రోజుకు ఆరు లీటర్ల పాలు ఇస్తున్నది. ఊళ్లోనే పాల కేంద్రంలో అమ్ముతం. లీటరు రూ.60 లెక్కన పడుతున్నయి. ఆ డబ్బులను విత్తనాల వడ్లు, కూలీల ఖర్చుకు పెడుతున్నా. దాంతోనే చేతికొచ్చిన పంట ఇంటిదాకా వస్తున్నది. నాకే కాదు, రైతు బంధు పథకం చాలామంది రైతులకు ఆసరా అయితున్నది.