వరంగల్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ):యాసంగిలో రైతులు వరికి బదులు ఇతర పంటలు వేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనేది లేదని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించారు. పెసర, పల్లి, జొన్న, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, శనగ, రాగులు, కుసుమ, జనుము తదితర పంటలు వేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఆయా విత్తనాలు సైతం అందుబాటులో ఉన్నాయని రైతు వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా కలెక్టర్ బీ గోపి, జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని పంట మార్పిడి, ఆరుతడి పంటల సాగుపై సూచనలు చేస్తున్నారు. మంగళవారం వీరితోపాటు జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, రైతుబంధు సమితి ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములయ్యారు. వరి కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని చెప్పారు.
యాసంగి వరి ధాన్యం కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం పంట మార్పిడిపై దృష్టిసారించింది. వరికి బదు లు ఇతర పంటల సాగులో రైతులను ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ జిల్లాలో 2,03,600 ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు ప్రణాళిక రూపొందించింది. అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తెచ్చి విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రధానంగా పెసర, వేరుశనగ, జొన్న, మినుము, నువ్వు, పొద్దుతిరుగుడు, శనగ, కుసుమ, జనుము, రాగి, తదితర ఆరుతడి పంటల సాగుపై అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ బీ గోపితోపాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పంట మార్పిడి, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం కొద్దిరోజుల నుంచి జిల్లాలో ఉద్యమంలా నడుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పంటమార్పిడి, ఈ యాసంగి వరికి బదులు ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు అనేక రూపాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. యాసంగి వడ్లు కొనబోమని కేంద్రం స్పష్టం చేసినందున వరి పంట సాగు చేసి రైతులు నష్టపోకుండా పంటమార్పిడి ద్వారా ఇతర పంటల సాగు చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వరికి బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటల సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనూ పంట మార్పిడి వైపు రైతుల దృష్టి మళ్లించాలని ముఖ్యమంత్రి తెలిపారు. యాసంగి వరికి బదులు ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన కలెక్టర్లకు చెప్పారు.
రైతు వేదికల్లో సదస్సులు
యాసంగి వరికి బదులు ఇతర పంటల సాగుపై వ్యవసాయ శాఖ జిల్లాలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే రైతు వేదికల్లో క్లస్టర్ స్థాయిలో రైతులతో సదస్సులు ఏర్పాటు చేసింది. ప్రస్తుత యాసంగి వరికి బదులు సాగు చేయడానికి అవకాశం ఉన్న ఇతర పంటలపై వ్యవసాయ శాఖ విస్తరణ, మండల, సహాయ సంచాలకులు సదస్సుల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతుబంధు సమితి ప్రతినిధులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సదస్సులకు హాజరవుతున్నారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఉషాదయాల్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. స్వయం గా జిల్లా కలెక్టర్ బీ గోపి ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటుండటమే గాకుండా గ్రామాల పర్యటనలో రైతులకు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన మంగళవారం నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లోని కన్నారావుపేట, ముద్దునూరు గ్రామా ల్లో జరిగిన అవగాహన సదస్సుల్లో పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జెడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్నతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు ఈ సదస్సుల్లో పాల్గొని పంట మార్పిడి, ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
వ్యవసాయశాఖ ప్రణాళిక
ఆరుతడి పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక తయారు చేసింది. ప్రస్తుత యాసంగి వేరుశనగ 40,794, పెసర 30,059, శనగ 28,116, మినుము 24,378, జొన్న 16,807, పొద్దుతిరుగుడు 9,124, నువ్వు 12,985, కుసుమ 1,125 ఎకరాలు, ఉద్యాన పంటలు 40,212 ఎకరాల్లో సాగు చేసేలా 2,03,600 ఎకరాలతో ప్రణాళికను ప్రభుత్వానికి పంపింది. ఈ మేరకు క్లస్టర్ వారీగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఆరుతడి పంటలకు రైతులకు ప్రోత్సహిస్తున్నారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆరుతడి పంటలే మేలు
యాసంగిలో వరికి బదు లు ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే క్లస్టర్, గ్రామం, రైతు సమూహం వారీగా ఈ కార్యక్రమం మూడు విడతల్లో పూర్తయ్యింది. నాలుగో విడత మళ్లీ క్లస్టర్ స్థాయిలో చేపట్టాం. జిల్లాలో పెసర, మినుము పంటలు జనవరి నుంచి మార్చి వరకు, నువ్వు పంట జనవరి, ఫిబ్రవరి, జొన్న పంట ఇప్పటి నుంచి జనవరి నెలాఖరు, వేరుశనగ జనవరి నెలలో సాగు చేయవచ్చు. పొద్దుతిరుగుడు, జనుము, రాగి, కుసుమ వంటి పంటల సాగుకూ అనువైన వాతవరణం ఇది. తెలంగాణ సీడ్స్ వద్ద రైతులు ఆరుతడి పంటల విత్తనాలు పొందవచ్చు. ఆరుతడి పంటల ఉత్పత్తులను అమ్ముకొనేందుకు మార్కెట్ వసతి కూడా ఉంది.