భువనగిరిలో నిన్న మొన్నటి వరకు గజం వేలల్లో ఉన్న స్థలాల ధరలు నేడు లక్షల్లో వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారి విస్తరణ, పట్టణ సుందరీకరణతో రోడ్డు వెంట ఉన్న స్థలాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రహదారి బంగ్లా నుంచి వినాయక చౌరస్తా, పాత బస్టాండ్ వరకు గతంలో గజానికి రూ.30 వేల నుంచి రూ.50వేల లోపు ఉండగా, ఇప్పుడు వినాయక చౌరస్తాలో గజం రూ.2లక్షలు, పాత గంజ్ మార్కెట్ ఏరియాలో రెండు లక్షలు చెప్తున్నారు. మెయిన్ రోడ్డు వెంట 50 గజాలు ఉంటే కోటీశ్వరులేనని స్థానికులు, వ్యాపారులు చర్చించుకుంటున్నారు. మరోవైపు రహదారి విస్తరణతో లోపలి షట్టర్లకుసైతం డిమాండ్ పెరిగింది.
భువనగిరి అర్బన్, డిసెంబర్ 18: భువనగిరి పట్టణంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. వాహనదారుల ఇబ్బందులతో పాటు పట్టణాన్ని సుందరీకరణగా మార్చడానికి ప్రధాన రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డు వెంబడి స్థలానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. 50 గజాల స్థలం ఉంటే కోటీశ్వరుడు అయినట్లేనని వ్యాపారస్తులు చర్చించుకుంటున్నారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే భువనగిరి పట్టణం మోడల్ సిటీగా మారనుంది. భువనగిరి రహదారి బంగ్లా నుంచి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి డిగ్రీ కళాశాల వరకు పనులు జరుగుతున్నాయి.
రోడ్డు విస్తరణతో పెరిగిన ధరలు…
భువనగిరి ప్రధాన రోడ్డు మార్గంలో గతంలో రహదారి బంగ్లా నుంచి వినాయక చౌరస్తా, పాత బస్టాండ్ వరకు గజానికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో గజం రూ.2లక్షలు పలుకుతున్నది. వినాయక చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు పక్కన స్థలాలు కోట్ల రూపాయలు పైగా ధర పలుకుతుండడం విశేషం. రోడ్డు విస్తరణ పనులు పూర్తికాక ముందే ఊహించని రీతిలో ధరలు పలుకుతున్నాయి.
మోడల్ సిటీగా పట్టణం…
పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే భువనగిరి పట్టణం మోడల్ సిటీగా మారనున్నది. ప్రధాన రోడ్డు మార్గానికి 100 ఫీట్ల వరకు స్థలాన్ని కేటాయించారు. డీవైడర్ల మధ్యలో విద్యుత్ పోల్స్ ఏర్పాటు, డివైడర్ నుంచి ఒకవైపులో వాహనాలు వెళ్లడానికి 7 మీటర్ల వెడల్పు, పార్కింగ్‌కు 4 మీటర్లు, ప్లాంటేషన్ (ఆహ్లాదాన్ని పంచే పూల మొక్కలు)కు 0.40 మీటర్లు, పుట్‌పాత్ 3మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భువనగిరి పట్టణం మోడల్ సీటీగా మారడంతో పాటు భూముల ధరలు పెరుగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.