వారసత్వంగా వచ్చిన కుండల తయారీ కుమ్మరులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. సంవత్సరం పొడవునా పెద్దగా ఆదాయం లేకపోయినా వేసవిలో గిరాకీతో జీవనం గడుపుతున్నారు. వేసవిలో ఉపశమనం కోసం చాలా మంది చల్లని నీటిని కోరుకుంటారు. ఫ్రిజ్ నీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రకృతి సిద్ధమైన మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు. దాంతో ఆదాయం పెరిగి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నది.
– మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 15
ఫ్రిజ్ నీళ్లకంటే మట్టి కుండల్లో నీరు ఆరోగ్యకరమని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో ఫ్రిజ్ ఉన్నా సరే చాలా మంది వేసవిలో మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు. మట్టితో తయారైన తాగునీటి కోసం కుండలనే కాకుండా మట్టితో తయారైన వంట పాత్రలను ఉపయోగిస్తున్నారు. స్టార్ హోటళ్లలోనూ మజ్జిగను మట్టి పాత్రల్లోనే తోడు పెట్టి వినియోగదారులకు అందిస్తున్నారు. అన్నం వండడానికి పాలు మరగబెట్టేందుకు మట్టి పాత్రలనే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టి పాత్రల తయారీ ఆర్డర్లు పెరుగుతున్నాయి. మార్కెట్లో 10లీటర్ల కుండ రూ.150 నుంచి 200 వరకు పలుకుతున్నది.
మార్కెట్లో నేడు మట్టి కుండలు వివిధ రకాల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భువనగిరి కుండలు(ఎర్రని కుండలు), నల్ల కుండలు, విజయవాడ కుండలని పలు రకాలుగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. కూజాలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి.
మట్టి కుండలో నీరు సహజ పద్ధతిలో చల్లబడుతుంది. మనం తినే ఆహారం శరీరంలో ఎక్కువ భాగం ఆమ్లంగా మారి టాక్సిన్ను సృష్టిస్తుంది. బంకమట్టితో తయారయ్యే కుండ ఆల్కలైన్ స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి శరీరంలో గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులు రాకుండా సహకరిస్తుంది. అంతే కాకుండా నీటిలోని ఖనిజాలు, పోషకాలను మట్టి కుండ చెక్కు చెదరనివ్వదు. వేసవిలో మట్టి కుండలోని నీరు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. వడ దెబ్బ నుంచి ఉపశమనం పొందుతాం.
కుమ్మరి వృత్తిపై ఉన్న మమకారంతో ఏండ్ల తరబడి కుండలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నాం. ప్రస్తుతం కుండల తయారీకి అవసరమయ్యే మట్టిని కొనుగోలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒండ్రు మట్టి భూములను కుమ్మరులకు కేటాయించాలి. కుండలు అమ్ముకునేందుకు వీలుగా రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించాలి. ఆర్థిక స్తోమత లేని పేద కుమ్మరులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో మట్టి కుండలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలి.
– మల్లికంటి వెంకటయ్య, కుమ్మరి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు, మిర్యాలగూడ
రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారులను ప్రోత్సహిస్తున్నది. కుమ్మరులకు కూడా ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. కుల వృత్తి కనుమరుగు కాకుండా ప్రోత్సాహకాలు అందించాలి. సబ్సిడీపై యంత్రాలను సమకూర్చాలి.
– మల్లికంటి శ్రీను, కుండల
తయారీదారు, జప్తి వీరప్పగూడెం