ఊరూరా రైతుబంధు వారోత్సవాలు రైతు బంధు సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరూరా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు వాకిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో మెరిసిపోతున్నాయి. ఊరి బడి, నారు మడి, పంట కల్లం, గిరిజన గూడెం రైతు బాంధవుడి కి జేజేలు పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలతో, ధాన్యంతో అభిషేకం చేసి రైతులు అభిమానం చాటుకుంటున్నారు. యాసంగికి సంబంధించి యాదాద్రి జిల్లావ్యాప్తంగా బుధవారం నాటికి 2,12,121 మంది రైతుల ఖాతాల్లో 220.22కోట్ల రూపాయలు జమయ్యాయి.
యాదాద్రి భువనగిరి, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు బంధు సాయం ఎవుసం కష్టాలకు పరిష్కారం చూపింది. షావుకారు వద్ద చేయిచాపే పరిస్థితులకు అడ్డు కట్ట వేసింది. తరతరాలుగా వస్తున్న పెట్టుబడి కష్టాలను తీర్చిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌కు రైతు కుటుంబాలు జేజేలు పలుకుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడో రోజూ రైతు బంధు సంబురాలు మిన్నంటాయి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతాంగం, అధికార యంత్రాంగం బుధవారం ఊరూరా వారోత్సవాలను వేడుకలా నిర్వహించాయి. పంట పొలాల వద్ద రైతులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నిర్వహించగా.. ఇండ్ల ముందు ముచ్చటగొలిపే ముగ్గులు వేసి మహిళలు ముఖ్యమంత్రి మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జై కేసీఆర్.. జై రైతు బంధు’ అని రాసి అభిమానం చాటుకున్నారు. కొన్ని మండలాల్లో రైతులు పంట చేలల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకాలు నిర్వహించారు. మోత్కూరు మండలం కొండగడప, పాటిమట్ల, దాచారం గ్రామాల్లో జరిగిన వారోత్సవాల్లో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొని కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రామన్నపేట మండలంలోని నిదాన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి పాల్గొని రైతు బంధు పథకం నేపథ్యం గురించి వివరించారు. ఇప్పటివరకు 2,21,121 మంది రైతుల ఖాతాల్లో రూ.220.22కోట్ల సాయాన్ని ప్రభుత్వం జమచేయడంతో రైతుల్లో ఉత్సాహం తొణికిసలాడుతున్నది. తమ జీవితాల్లో పండుగ తెచ్చిందంటూ రైతు మోములో సంతోషం వెల్లివిరుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో చిల్లిగవ్వ కూడా రైతులకు ఇవ్వలేదని, స్వరాష్ట్రంలో వేలకోట్ల రూపాయలను పంట పెట్టుబడిగా అందించి సాయం చేస్తున్న ప్రభుత్వం ఉండడం తమ అదృష్టమని రైతులు పేర్కొంటున్నారు. ఎవుసానికి ఎంతో ఊతమిచ్చిన రైతు బంధు పథకం గురించి భావితరాలకు తెలియజెప్పేందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున వారోత్సవాల్లో పాల్గొంటున్నారు.
రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం
రామన్నపేట, జనవరి 5: రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నిదాన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ రైతులు పెట్టుబడుల కోసం అప్పు చేయకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎకరాకు పదివేలు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడాలేవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ అదనపు గది నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, టీఆర్ఎస్పార్టీ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, సర్పంచ్ గుత్తా నర్సింహారెడ్డి, ఎంపీటీసీ గోగు పద్మాసత్తయ్య, తాసీల్దార్ వి.ఆంజనేయులు, ఎంపీడీఓ గాదె జలేందర్‌రెడ్డి, ఏఓ యాదగిరిరావు, విస్తరణాధికారులు శ్రీనివాస్, వెంకన్న, కిరణ్ వివిధ గ్రామాల సర్పంచ్‌లు వార్డు సభ్యులు పాల్గొన్నారు.