తీపి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2021 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు చెప్పి.. కోటి ఆశలు, ఆకాంక్షలతో 2022 నూతన సంవత్సరానికి ఉమ్మడి జిల్లా ప్రజలు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి నుంచే మొదలైన న్యూ ఇయర్ ఉత్సాహం అర్ధరాత్రి అయ్యే సరికి అంబరాన్ని తాకింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతల కోలాహలంతో మార్మోగింది.
కోటగిరి, డిసెంబర్ 31: జ్ఞాపకాల తెరచాటుకు మరో ఏడాది తరలిపోయింది. విభిన్న అనుభవాలు, అనుభూతుల స్మృతులను మిగి ల్చి ఇక వెళ్లొస్తానంటూ సెలవు తీసుకోవడంతో కేరింతలు, ఉల్లాసంతో అంతా కొత్త అతిథికి స్వాగతం పలికారు. కొవిడ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మరిచిపోయి న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. కరోనా మహమ్మారితో గతేడాది అంతంత మా త్రంగానే జరిగిన వేడుకలు… కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈసారి న్యూ ఇయర్ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు.
సంబురాల్లో యువత
ఉమ్మడి జిల్లాలో కొత్త సంవత్సర ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా చిన్నా, పెద్దా సంబురాల్లో మునిగితేలారు. యువత కేరింతలు, ఆటపాటలతో సందడి చేసింది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబు తూ కోటి ఆశలతో స్వాగతం పలికారు. ఇండ్ల ల్లో కేక్‌లు కట్ చేసి సాదరంగా ఆహ్వానించారు
సెల్ ముఖ్యమే కానీ..
సెల్‌ఫోన్ మన జీవితంలో తప్పనిసరిగా మారింది. కానీ, అదే మనకున్న సమయాన్ని వృథా చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో మాములు సెల్ఫోన్లతో స్నేహితులతో మాట్లాడడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఫేస్బుక్, వాట్సప్, గేమ్స్, ఇతర యాప్స్ ఉన్న సెల్ఫోన్లు సమయాన్ని కాస్తా హరించివేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో సాంకేతికత వాడుకోవడం ముఖ్యమే. అయినా అది మనకు ఎంత వరకు అవసరమో గుర్తించాలి. ఆ మేరకే సెల్‌ఫోన్‌ను ఉపయోగించాలి.
నూతన ఆలోచనలకు శ్రీకారం చుడదాం
2021 సంవత్సరం నిన్నటితో ముగిసింది. నేటి నుంచి 2022 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. నూతన సంవత్సరాన్ని జీవితానికి అనుకూలంగా తీర్చిదిద్దికునేందుకు నడుం బిగిద్దాం. నూతన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేలా ముందుకు సాగుదాం.ఓటమి ఎదురైనా నిరాశ, నిస్పృహలకు గురికాకుండా మరింత పట్టుదలతో ముందుకుసాగడమే విజయానికి నాంది అవుతుంది.
లక్ష్యానికి బీజం పడాలి
కాలాన్ని సరిగ్గా వినియోగిస్తే కాసుల వర్షం కురిపిస్తుందంటారు ఆర్థిక నిపుణులు. కాలం కన్నా కాస్త ముందుకెళ్లి ఆలోచించే వాళ్లు కాలానుగుణంగా వచ్చే మార్పులను జీర్ణించుకునేలా విజేతలవుతారు. నిర్ణీత గడువు ఉంటే నిర్ధిష్ట సమయంలోపు గమ్యాన్ని చేరుకోవచ్చు. ఆదరబాదరగా, ఉన్నపళంగా, మెడ మీద కత్తి పెట్టినట్టు ఏపని చేసినా దానిలో పరిపూర్ణత లోపిస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోనంత కాలం డబ్బు, వనరులు, తెలివితేటలు, నైపుణ్యాలను వినియోగించుకోలేం.
జోరుగా వ్యాపారాలు
నూతన సంవత్సర వేడుకల సందర్భం గా వ్యాపారాలు జోరుగా సాగాయి. రంగులు, పూలు, పండ్లు, కేక్‌లు, స్వీట్లు, బిర్యానీలు, మద్యం, చికెన్ అమ్మకాలు ఊపందుకున్నాయి. కేక్‌లు తగ్గింపు ధరల్లో లభ్యం కాగా, రెస్టారెంట్ల స్పెషల్ ఆఫర్లతో బిర్యానీల కొనుగోళ్లు ముమ్మరంగా సాగాయి.