
ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 20 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం(పత్తి) మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. సోమవారం ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో గరిష్ఠ ధర క్వింటాల్ రూ.8,550 పలికి ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. పక్షంరోజుల నుంచి అంచెలంచెలుగా పత్తి ధరలు పెరుగుకుంటూ వస్తున్నాయి. యార్డుకు పంట తక్కువ వస్తున్న నేపథ్యం, జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు మంచి డిమాండ్ పలుకుతుండడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం యార్డుకు సుమారు 7,800 పత్తి బస్తాలను ఆయా జిల్లాల నుంచి రైతులు తీసుకువచ్చారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన వై.కోటేశ్వరరావు 72బస్తాలను తీసుకురాగా, పంట ఏ గ్రేడ్ కావడంతో ఖరీదుదారులు పోటీపడ్డారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం మార్కెట్లోనే రికార్డు స్థాయి ధర పలకడానికి కారణమైంది. ఈ సంవత్సరం పత్తిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. పత్తికి బదులు మిర్చిసాగు పట్ల సాగు రైతులు ఆసక్తి కనబరిచారు. దీంతో పంట ఉత్పత్తులు తగ్గడం.. అదే సమయంలో మార్కెట్లో మంచి డిమాండ్ రావడంతో పత్తి రైతులకు కలిసి వచ్చినైట్లెంది. ఈ సంవత్సరం పత్తి పంటకు సీసీఐ మద్దతు ధర క్వింటాల్ రూ.6 వేలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో మద్దతు ధరకు మించి క్వింటాల్‌కు ఒక్కంటికి రూ.2,500 పైబడి పలుకుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.