
మహబూబ్‌నగర్, డిసెంబర్ 28: దళిత కుటుంబాలను ఉన్నతస్థాయికి తీసుకొచ్చేందుకు వందశాతం దళితబంధు పథకాన్ని అమలుచేసి తీరుతామని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, అంతకుముందు ఒక్కమారు గ్రామాల్లో, పట్టణాల్లో భేదం గమనించాలని సూచించారు. గతంలో జెడ్పీటీసీలు గ్రామాల్లో తిరగాలంటే భయపడేవారిని, ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. తాగు, సాగునీరు, విద్యుత్‌తోపాటు అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమైనదన్నారు. జిల్లాకు సంబంధించి రూ.220 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కరోనా నివారణకు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. అన్ని గ్రామాలు నూటికి నూరుశాతం వ్యాక్సిన్ వేసుకునేలా జెడ్పీటీసీలు, ఎంపీపీలు చర్యలు తీసుకోవాలన్నారు. 100శాతం వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న గ్రామాల సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలను ఘనంగా సత్కరిస్తామన్నారు. ఆ గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాత కలెక్టరేట్లో సూపర్‌స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తామని, జనరల్ దవాఖానలో రెండు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లతోపాటు 560 పడకల స్థాయికి పెంచామని, కొవిడ్ వార్డును ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. త్వరలోనే కోయిల్‌సాగర్‌లో నాలుగు బోట్లను ఏర్పాటు చేసే బోటింగ్ ప్రారంభిస్తామని, కోయిల్‌సాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఒక అతిథి గృహాన్ని నిర్మిస్తామన్నారు.
సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతుబీమా, రైతుబంధుతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
ఇతర పంటలపై దృష్టి పెట్టాలి
ఎప్పుడూ వరి వేసే పద్ధతిని మార్చుకొని ఇతర పంటల విధానంపై దృష్టి పెట్టాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర పంటలను సాగుచేస్తే ఎంత లాభం వస్తుందో ఒక్కసారి బేరిజు వేసుకోవాలని సూచించారు. డిమాండ్ లేని పంటలను పండించి ఎందుకు నష్టపోవాలని తెలిపారు. కొందరు ఉద్ధేశపూర్వకంగా వరి సాగు చేయాలని చెబుతారని, అసలు సమయానికి వారు ఎక్కడా కనిపించరని, రైతులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి మంచిగా లాభాలు వచ్చే పంటలను సమృద్ధిగా పండించుకుని లాభాల పొంది సంతోషంగా జీవించాలన్నారు. అనంతరం దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి పాఠశాలలో స్థానిక క్యాడర్ కేటాయింపులో భాగంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టు ఖాళీ అవుతున్నదని, ఇప్పటికే రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పోస్టులు ఖాళీగా ఉంచకుండా కేటాయింపు చేయాలని దరఖాస్తును మంత్రికి దేవరకద్ర జెడ్పీటీసీ సమర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జెడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులను ఆదరిద్దాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ మైదానంలో 66మంది లబ్ధిదారులకు రూ.25 లక్షల విలువైన ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ ల్యాప్‌టాప్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. అవసరమైన వారికి వినికిడి యంత్రాలు, మూడు చక్రాల రిక్షాలు, ఎలక్ట్రికల్ స్కూటీలు, ల్యాప్‌ట్యాప్‌లతో సహ అనేక రకాల పరికరాలను అందజేసినట్లు తెలిపారు. ఏ రాష్ట్రంలో అమలుచేయని విధంగా దివ్యాంగులకు రూ.3వేల పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు. 13 ట్రై స్కూటీలు, ఒక బ్యాటరీ వీల్ చైర్, 4 వీల్ చైర్, ఆరు ల్యాప్‌టాప్‌లు, 4 స్మార్ట్ఫోన్లు, 6 ట్రై సైకిల్స్, 12 హియరింగ్ ఎయిడెడ్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక మేళా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎస్ వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి బేగం, దివ్యాంగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రవికుమార్, మధుబాబు, నర్సింహులు, యాదమ్మ అధికారులు ఉన్నారు.