
గద్వాల, డిసెంబర్ 20 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లు కొనేవరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తెలంగాణపై కుట్రపూరితమైన వివక్ష చూపుతుందన్నారు. రైతులు పండించిన ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని ఉంచుకుని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన బీజేపీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇతర రాష్ర్టాలకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం చేయడం దురదృష్టకరమని చెప్పారు. అలాగే నూతన విద్యుత్ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబర్, జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సతీశ్‌కుమార్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, దౌలు, కృష్ణ పాల్గొన్నారు.