
మహబూబ్‌నగర్, డిసెంబర్ 15 : ఎలాంటి సమస్య వచ్చినా కుటుంబపెద్దగా పరిష్కరిస్తానని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చిలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా సెమీక్రిస్మస్ సంబురాలను నిర్వహించారు. రెవరెండ్ వరప్రసాద్‌తో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్వరి కొండపై ప్రత్యేక భవనం ఏర్పాటుతోపాటు సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వేడుకల సమయంలో మైక్‌లను తీసుకెళ్లిన సందర్భాలున్నాయని, ఇప్పుడు ఎలాం టి ఇబ్బందుల్లేకుండా క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటున్నామన్నారు. పేద పాస్టర్ల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పాస్టర్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాలువ, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు గోవింద్, రాణి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు వరలక్ష్మి, చర్చి అసోసియేషన్ సభ్యులు ఆర్.ఆర్.జోసఫ్, ఎంకే జోసఫ్, టైటాస్ రాజేందర్, దాసరి సుందర్, బీఐ బేకబ్, ఏఆర్. రాజేశ్‌బాబు, సుందర్, బెంజిమాన్, మారియాన్, స్వామిదాస్, సుందర్‌పాల్, డేవిడ్, ప్రభాకర్, జేఎన్పాల్, పరంజ్యోతి తదితరులు ఉన్నారు.
పనుల్లో నాణ్యత లోపించొద్దు..
అభివృద్ధి పనులు నాణ్యతగా వేగంగా జరగాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. పాలకొండ చెరువు వద్ద చేపట్టిన అభివృద్ధి పనులు, స్ట్రీట్ వెండర్ షాప్‌లను మంత్రి పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు నరేందర్, సూరిబాబు ఉన్నారు.