వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహన ఫలిస్తున్నది. పంట మార్పిడే లక్ష్యంగా అన్నదాతలు వేరుశనగ, శనగ తదితర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. దీంతో వికారాబాద్ జిల్లాలో ఇతర పంటల సాగు గణనీయంగా పెరుగనున్నది. ఈ యాసంగిలో జిల్లావ్యాప్తంగా లక్షా 20వేల పైచిలుకు ఎకరాల్లో ఆరుతడి పంటల సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 44,776 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేపట్టారు. ఇందులో అత్యధికంగా 19038 ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు. ఇంకా సమయం ఉన్నందున సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది. మరోవైపు యాసంగి సాగుకు సరిపడా ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచారు.
పరిగి, డిసెంబర్ 11 : యాసంగి సీజన్లో ఆరుతడి పంటల సాగు వికారాబాద్ జిల్లాలో పెరుగుతున్నది. కేంద్రం వడ్లు కొనుగోలు చేయబోమని స్పష్టంగా చెప్పడంతో ఇతర పంటల సాగు వైపు మళ్లించేందుకు ప్రభుత్వ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా జిల్లా పరిధిలో ఆరుతడి పంటల సాగు రోజురోజుకూ పెరుగుతున్నది. 2020 యాసంగిలో 1.20లక్షల ఎకరాలో వివిధ పంటలు సాగు చేశారు. ఈసారి కూడా యాసంగిలో అదే స్థాయిలో పంటల సాగుంటుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 44776 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేశారు. వాటి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది. పంటల సాగుకు అవసరమైన ఎరువులు సైతం అధికారులు అందుబాటులో ఉంచారు.
44776 ఎకరాల్లో వివిధ పంటలు సాగు
యాసంగి సీజన్లో ఇప్పటివరకు 44776 ఎకరాలలో వివిధ పంటలు సాగు చేశారు. ఈసారి సైతం లక్షా20వేల పైచిలుకు ఎకరాల్లో సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా పరిధిలో 55వేల వ్యవసాయ బోర్లు, 1179 చెరువులు, ఒక మధ్యతరహా ప్రాజెక్టు ఉన్నది. చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా 19,038 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశారు. గత యాసంగిలో కంటే రెట్టింపు స్థాయిలో ఈసారి వేరుశనగ సాగు చేశారు. శనగ 14191, జొన్న 6243, మొక్కజొన్న 82, పొద్దు తిరుగుడు 64, తెల్ల కుసుమలు 3197, గోధుమ 42, స్వీట్‌కార్న్ 102, కంది 743, పెసర 154, బెబ్బెర్లు 659 ఎకరాల్లో సాగయ్యాయి. ఇప్పటికే జిల్లా స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులతో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసిన అధికారులు మండల స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. కేంద్రం వడ్ల కొనుగోలుపై ఆడుతున్న నాటకాన్ని రైతులు సైతం గమనిస్తున్నారు. కేంద్రం వైఖరితో వరి వేసి ఇబ్బందులు పడేకంటే ఆరుతడి పంటలు సాగు చేయడం మేలనేలా రైతులు కూడా ఇతర పంటల సాగు వైపు తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి నెల మూడో వారంలో పెసర, మినుములు, వేరుశనగ సైతం సాగు చేయవచ్చు. వరి పొలాల్లో కోతలు పూర్తవుతున్నందున పొలాలు ఆరిన తర్వాత ఈ పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
పంటలకు సరిపడా ఎరువులు
యాసంగి సీజన్లో వివిధ పంటల సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా వ్యవసాయాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. యాసంగి సీజన్లో సాగు చేసే పంటలకు 28,293 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో యూరియా 11387, డీఏపీ 6100, ఎంవోపీ 1696, కాంప్లెక్స్ 6787, ఎస్ఎస్పీ 2321 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదించగా అందులో ఏ నెల ఎంత అవసరమవుతుందో గుర్తించి ఎరువులు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా పరిధిలోని పీఏసీఎస్‌లలో 2345 మెట్రిక్ టన్నులు, డీలర్ల వద్ద 2121 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 4123 మెట్రిక్ టన్నులు, మొత్తం 8589 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
పెరుగనున్న ఆరుతడి పంటల సాగు : గోపాల్, జిల్లా వ్యవసాయశాఖాధికారి
వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ యాసంగి సీజన్లో ఆరుతడి పంటల సాగు పెరుగనున్నది. గత సంవత్సరం కంటే ఈసారి వేరుశనగ సాగు ఇప్పటికే రెట్టింపు కంటే అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఇతర ఆరుతడి పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు తెలియజేస్తున్నాం. తద్వారా ఈ యాసంగిలో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది.