భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 8 (నమస్తే తెలంగాణ): విచ్చలవిడిగా భూదందాలు.. మహిళలపై వేధింపులు.. అడ్డూ అదుపు లేకుండా అరాచకాలు.. ఏక పక్షంగా సివిల్ పంచాయతీలు.. అడ్డు వచ్చిన వారిపై అనుచరులతో దాడులు.. ఒకటి కాదు రెండు కాదు వనమా రాఘవ చేసిన అరాచకాలు లెక్కలేనన్ని. ఎన్ని దందాలు చేసినా ఏం లాభం. పాపం పండి చివరికి కటకటాలు లెక్కిస్తున్నాడు. ఈనెల 3న పాత పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబ సజీవ దహన ఘటనతో రాఘవ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
నాలుగు రోజులు హైడ్రామా..
నాగ రామకృష్ణ కుటుంబం సజీవ దహనం తర్వాత పాల్వంచ నుంచి పరారయ్యాడు వనమా రాఘవ. కుటుంబ సజీవ దహన ఘటనలో పోలీసులు రాఘవ ఏ2 ముద్దాయిగా కేసు నమోదు చేశారు. నిందితుడు నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు తెలుగు రాష్ర్టాలను జల్లెడ పట్టాయి. పాత కేసులో బెయిల్ పై ఉన్న రాఘవ పరారీలో ఉండడంతో పోలీసులు అతడి ఇంటికి నోటీసులు సైతం అంటించారు. ఆ తర్వాత పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో హైడ్రామా జరిగింది. అఖిల పక్ష నేతలు నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. రాస్తారోకోలు నిర్వహించారు.
అనేక పరిణామాల తర్వాత శుక్రవారం రాత్రి దమ్మపేట మండలంలోని మందలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద రాత్రి పోలీసులకు పట్టుబడ్డాడు వనమా రాఘవ. నిందితుడి వెంట ఉన్న మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 12 గంటల సమయంలో నిందితుడిని పాల్వంచ డీఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. పాల్వంచ ఏఎఎస్పీ రోహిత్‌రాజ్ నిందితుడిని విచారించారు. రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఘటనపై నేరాన్ని అంగీకరించాడు. ఇతర కేసులపైనా పోలీస్ విచారణ సాగింది. ఉదయం 3 గంటల వరకు విచారణ కొనసాగింది. పోలీస్ సిబ్బంది ఉదయం 7 గంటలకు అల్పాహారం తీసుకువచ్చినా రాఘవ నిరాకరించాడు. పాల్వంచ వైద్యాధికారి ముక్కంటేశ్వరరావు డీఎస్పీ కార్యాలయానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాఘవ అరెస్టు విషయం తెలుసుకున్న ఆందోళనకారులు పెద్ద ఎత్తున డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. రాఘవ విచారణ ఎలా సాగింది? విచారణలో నిందితుడి ఏం చెప్పాడు ? అన్న విషయాలపై చర్చోపచర్చలు సాగాయి. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత పోలీసులు నిందితుడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తీసుకువెళ్తుండగా లక్ష్మీదేవిపల్లిలో నిరసనకారులు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు చాకచక్యంగా ఆందోళనకారులను నిలువరించారు. వాహనాన్ని నేరుగా మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లి పావుగంటలో రిమాండ్ పత్రాలు సాధించారు. నిందితుడి భద్రాచలంలోని సబ్‌జైలుకు తరలించారు.
ఓ బాధితుడి ఆవేదన..
‘నా సోదరి అబ్దుల్ పర్వీన్ 1999లో పాల్వం చ పట్టణంలో ఇంటి స్థలం తీసుకున్నది. వనమా రాఘవ గతేడాది తన అనుచరులతో కలిసి సదరు స్థలాన్ని పర్వీన్‌కు దక్కకుండా చేశాడు. మాకు న్యాయం చేయాలి.’ అని పాల్వంచకు చెందిన దస్తగిరి అనే స్థానికుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి గోడు వెల్లబోసుకున్నాడు.
మరో బాధితురాలు..
‘పట్టణంలోని సోనియానగర్‌లో నేను స్థలం కొన్నాను. గతేడాది మే నెలలో వనమా రాఘవ అనుచరులు స్థలానికి వచ్చారు.ఆ స్థలం తమది అంటూ నాపై దాడి చేసి గాయపరిచారు. రాఘవనే దీనికి కారణం. ఈ విషయంపై అప్పుడే పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఈ కేసులో రాఘవను తప్పించి అనుచరులను కేసులో ఉంచారు. దీనిపై న్యాయం కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాను. అనేక ఒత్తిళ్ల తర్వాత రాఘవపై 17వ నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి మాకు న్యాయం చేయాలి..’ అని పాల్వంచకు చెందిన భూక్యా జ్యోతి అనే బాధితురాలు డిమాండ్ చేసింది.