భద్రాచలం/ పర్ణశాల, జనవరి 8 : భద్రాద్రి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం వైకుంఠరాముడు పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రామయ్యను చూసి భక్తులు పరవశించిపోయారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, నిత్య హోమాలు, నిత్య బలిహరణం పూజలు నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవ పెరుమాళ్ల, ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణ పరమాత్మ, పన్నిద్ధరాళ్వార్లను బేడా మండపంలో ఉంచి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం చేశారు. ఉత్సవమూర్తులను పరశురాముడిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ రామయ్యను దర్శించుకున్నారు.
నేడు రామావతారం
భద్రగిరీశుడు ఆదివారం రామావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. లోక కంఠకులైన రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుడి తనయుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారమే శ్రీరామావతారం. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని భావించి పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శమూర్తి, మర్యాద పురుషోత్తముడు, మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు శ్రీరాముడు. సూర్యగ్రహ బాధలున్నవారు రామావతారాన్ని దర్శించడం వల్ల ఆ బాధల నుంచి విముక్తి పొందుతారని లోకోక్తి. పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారు పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు భార్గవాచార్యులు, కిరణ్కుమారాచార్యులు, నర్సింహాచార్యులు, ఆలయ సూపరింటెండెంట్ కిశోర్, ఆలయ ఇన్చార్జి ప్రసాద్, రాము, శివ పాల్గొన్నారు.
11న కూడారై ఉత్సవం
భద్రాచలం దేవస్థానంలో ఈ నెల 11న ‘కూడారై’ ఉత్సవాన్ని కొవిడ్ నియమ, నిబంధనలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శివాజీ శనివారం తెలిపారు. భక్తులు రూ.150 చెల్లించి ప్రసాదం స్వీకరించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.