ఖలీల్‌వాడి/ విద్యానగర్, జనవరి 3 : టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నిజామాబాద్ నగరంలోని మాలపల్లి పీహెచ్సీలో జిల్లావైద్యారోగ్య శాఖ అధికారి సుదర్శనం టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో 15 నుంచి 18 సంవత్పరాల వారు 76,900 మంది ఉన్నారని వెల్లడించారు. మొదటి రోజైన సోమవారం 3,237 మందికి టీకాలు వేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారాం రాథోడ్, వైద్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో సోమవారం 820 మంది టీనేజర్లకు టీకాలు వేశామని డీఎంహెచ్‌వో కల్పన కాంటే తెలిపారు.
మొదటి రోజు నిజామాబాద్ జిల్లాలో 3237 మందికి, కామారెడ్డి జిల్లాలో 820 మందికి టీకాల పంపిణీ ఒమిక్రాన్ వ్యాప్తిని నిరోధించేందుకు సహకరించాలి
నిజామాబాద్ సీపీ కేఆర్. నాగరాజు
నిజామాబాద్ క్రైం, జనవరి 3 : ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని నిజామాబాద్ సీపీ కేఆర్. నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈనెల 10వ తేదీ వరకు కమిషరేట్ పరిధిలో ర్యాలీలు, బహిరంగ సభలు, రాజకీయ, మతపరమైన సభలు, ఒకే చోట గుమిగూడవద్దని పేర్కొన్నారు. వ్యాపార, వర్తక సముదాయాల వద్దకు వచ్చే కస్టమర్లు మాస్కును ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని పేర్కొన్నారు. వ్యాపారులు తమ దుకాణాల్లో శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. మాస్కు ధరించని వారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జాతీయ విపత్తు నిబంధనలు పాటించని వారిపై 51 నుంచి 60 సెక్షన్లు, 188 ఐపీసీ ప్రకారం చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ మాస్కును భౌతిక దూరం పాటించి ఒమిక్రాన్ కట్టడికి సహకరించాలని కోరారు.
నిజామాబాద్ సిటీ, జనవరి 3 : టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియను జనవరి 7వ తేదీలోగా వంద శాతం పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 15 నుంచి 18 ఏండ్ల వయస్సు ఉన్న ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ వేయాలన్నారు. వ్యాక్సిన్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, ఆర్డీవోలు, వైద్యశాఖ అధికారులతో సమన్వయం చేస్తూ లక్ష్యాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. ఈ విషయంలో ఫిర్యాదులను స్వీకరించడానికి డీఎంహెచ్‌వో కార్యాలయంలో కంట్రోల్ రూమును ఏర్పాటు చేశామని, 8309219710 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంహెచ్‌వో సుదర్శనం, అధికారులు పాల్గొన్నారు.