నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 3 : జిల్లా వ్యాప్తంగా15 నుంచి 18ఏండ్లలోపు టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వైద్యారోగ్య సిబ్బంది టీకా వేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుదర్శనం ఆర్డీవో రాజేశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విద్యతో కలిసి బోధన్ పట్టణంలోని శ్రీవిజయసాయి ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. వ్యాక్సిన్ ఆవశ్యకతపై అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
భీమ్‌గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ చిరంజీవితో కలిసి డాక్టర్ విజయ్‌పవార్ ప్రారంభించారు. మోర్తాడ్ సీహెచ్‌సీలో సర్పంచ్ ధరణి, ఏర్గట్లలోని కస్తూర్బా పాఠశాలలో వైద్యాధికారిణి స్టేఫిరాణి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మోర్తాడ్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు మండల వైద్యాధికారి నయనారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది టీకా వేశారు. ఆర్మూర్ మండలం ఆలూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 70 మంది విద్యార్థులకు వైద్యాధికారి భాస్కర్‌రావు టీకా వేశారు. రెంజల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్‌ను సర్పంచ్ రమేశ్‌కుమార్ ప్రారంభించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు మండల వైద్యాధికారి రఘువీర్ గౌడ్ ఆధ్వర్యంలో కరోనా టీకా వేశారు. మోస్రాలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు వైద్యాధికారి మధుసూదన్ టీకా వేశారు.