
రైతు వ్యతిరేక ధోరణి అవలంభిస్తున్న కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నిరసనలకు సన్నద్ధమైంది. సోమవారం ఊరూరా ధర్నాలు నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఉమ్మడి జిల్లాలోని పార్టీశ్రేణులు సిద్ధమయ్యాయి. ఉదయమే నాయకులు నల్ల బ్యాడ్జీలు, నల్లని దుస్తులు ధరించి ప్ల కార్డులు చేతబట్టి నల్ల జెండా ఎగురవేయనున్నారు. అనంతరం కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేయడం, చావు డప్పు కొట్టడం వంటి కార్యక్రమాలతో బీజేపీ తీరును ఎండగట్టనున్నారు. ధర్నాల్లో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొననున్నారు.
మహబూబ్‌నగర్ డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభించడంతోపాటు తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తునందుకుగానూ నిరసనగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నా చేపడుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం..తెలంగాణపై వివక్ష చూపుతున్నదని, మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నది.
రాష్ట్రంలో కోటి 35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, కేంద్రం కేవలం 60లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామనడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్లమెంట్ వేదికగా ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేశారు. నిత్యం పార్లమెంటులో ప్లకార్డులతో కేంద్రం వైఖరిని ఎండగట్టారు. పార్లమెంట్ బయట గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టి దేశం మొత్తానికి కేంద్రం తెలంగాణ పట్ల అవలంబిస్తున్న మొండి వైఖరిని తెలిసేలా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో మాట్లాడి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీరులో కొంత కూడా మార్పు రాలేదు. కేంద్రంపై చేస్తున్న పోరులో భాగంగా… కేంద్రం మొండి వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు కూడా తెలిసేలా టీఆర్ఎస్ పార్టీ గ్రామ గ్రామాన బీజేపీ ప్రభుత్వ శవయాత్ర, దిష్టిబొమ్మల దహనం చేపట్టి నిరసన తెలిపేందుకు నిర్ణయించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కేంద్రం తీరును ఎండగడుతూ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సోమవారం ఉదయం గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ తీసి నల్లజెండా ఎగురవేసి నిరసన తెలపడం, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం, చావు డప్పు కొట్టడం లాంటి కార్యక్రమాలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని తీసుకోవాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా ప్రతి గ్రామంలో ఒక రిజిస్టర్ పెట్టి రైతుల సంతకాలు సేకరించనున్నారు.
జెడ్పీ నుంచి శవయాత్ర..
తెలంగాణ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా కేంద్రం వివక్ష చూపిస్తోంది. తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్షను ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మైదానం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు శవయాత్ర జరుగుతుంది. తెలంగాణ చౌరస్తాలో కేంద్రం, మోడీ దిష్టిబొమ్మల దహనం ఉంటుంది. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కేంద్రం ధాన్యం కొనుగోలు ఆపడం వల్ల తమ ఉపాధి పోయిందని సుమారు వెయ్యి మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారు.