
రఘునాథపాలెం, డిసెంబర్19: సెలవు రోజున సరదాగా స్నేహితులతో సాగర్ కాలువకు ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు గల్లంతైన ఘటన ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలో చోటుచేసుకున్నది. ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన పలువురు ఖమ్మం, సూర్యాపేట, కోదాడలోని ఓ ప్రైవేటు ఆయుర్వేద వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఆదివారం ఖమ్మానికి వచ్చారు. సరదా కోసం నగరం సమీపంలోని దానవాయిగూడెం సాగర్ కాలువ వద్దకు ఏడుగురు వెళ్లారు. సాగర్ కాలువలోకి ముగ్గురు ప్రదీప్, శిబ్బు, షాజీ దిగి ఈత కొడుతున్నారు. ఒడ్డున షారోన్, వివేక్, అభయ్, సోను ఉన్నారు. ఈ క్రమంలో షారోన్ ప్రమాదవాత్తు కాలువలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు వివేక్, అభయ్, సోను నీళ్లలోకి దిగారు. అప్పటికే కాలువలో ఉన్న ప్రదీప్ షారోన్ను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చాడు. తర్వాత వివేక్, అభయ్, సోను నీళ్లలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.