నిజామాబాద్, జనవరి3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారి రెండేండ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్నది. కొన్నిరోజులుగా కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ మానవ సమాజానికి సవాల్ విసురుతోంది. కొత్త వేరియంట్లు వైద్యులు, శాస్త్రవేత్తలకు తలనొప్పిగా మారుతున్నాయి. అంతుచిక్కని విధంగా రూపాన్ని మలుచుకుంటూ మనుషులను అంటేసుకుంటున్నది. ఒక చోట మొదలైన వేరియంట్ల వ్యాప్తి రోజులు గడిచే కొద్దీ ఒక్కసారిగా దేశాలు దాటి ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ ఇప్పుడు మన దేశంతోపాటు రాష్ట్రంలోనూ వ్యాప్తి చెందుతున్నది. వీటికి తోడు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజల్లో సెకండ్ వేవ్ తర్వాత భయం అన్నది కనిపించడం లేదు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో తీసుకోవడంతో అందరిలోనూ తమకేం కాదనే ధీమా కనిపిస్తోంది. మొదటి, రెండో వేవ్ కన్నా మూడో వేవ్ త్వరగా వ్యాప్తి చెందుతున్నది. అదృష్టం కొద్దీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఇంత వరకు ఒమిక్రాన్ వేరియంట్ రాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలంటూ అవగాహన కల్పిస్తున్నది.
పెరుగుతున్న కేసులు
ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇప్పటికే దేశంలో ఈ వైరస్‌పై పరిశోధనలు చేస్తున్న దరిమిలా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. కొవిడ్కారక వైరస్లు ప్రధానంగా శ్వాసకోశంపై దాడి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై మరింత ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. వైరస్ సోకిన తర్వాత ఒకటి నుంచి నాలుగు రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. కొవిడ్ వైరస్ సోకిన తర్వాత రెండు నుంచి 14 రోజుల్లో రోగ లక్షణాలు శరీరంలో పెరుగుతాయి. కరోనా వైరస్ ఉధృతి తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలోని చాలా మందిలో సామాజిక స్పృహ కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నప్పటికీ నూతన సంవత్సర వేడుకల్లో కనిపించిన జోష్ ఓ రకంగా ఆందోళనకు గురి చేస్తున్నది. భౌతిక దూరంతోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే అవకాశాలుండగా ప్రజలు కనీస నియమాలు పాటించడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇకపై సీరియస్‌గా స్పందించనున్నది. కొవిడ్ -19 మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో దారిలోకి తెచ్చేందుకు సిద్ధమైంది.
టీకాకు దూరం!
కరోనా మహమ్మారి నుంచి మానవ సమాజం బతికి బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా వచ్చిన టీకాలు ఓ రకంగా రక్షణ కవచాలుగా మారుతున్నాయి. మనల్ని మనం కాపాడుకోవడంలో భాగంగా ప్రజలంతా టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే పల్లె, పట్టణాల్లో కొంత మంది మాత్రం టీకా తీసుకునేందుకు ముందుకురావడంలేదు. టీకా అంటేనే ఆమడ దూరం పారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖ సిబ్బంది స్వయంగా ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నారు. అయినప్పటికీ వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్తున్నవారు.. టీకాలు వేసే బృందాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. చేసేది లేక అడవులు, సుదూర ప్రాంతాలకు వైద్య బృందాలు వెళ్లి వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. అయినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో మొదటి డోసుకు సుమారు 85వేల మంది దూరంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి డోసు తీసుకుని రెండో డోసు కాల పరిమితి మించినప్పటికీ టీకా వేసుకునేందుకు రానివారు కూడా లక్షల్లో ఉన్నారు. రెండో డోసు తీసుకోవాల్సిన వారు నాలుగున్నర లక్షల మంది ఉన్నటు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 275 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా, 1212 మంది ఆశ కార్యకర్తలు ఉన్నారు.
3లక్షల మంది బాలబాలికలకు వ్యాక్సిన్
ప్రపంచ వ్యాప్తంగా వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కొవిడ్ బారిన పడుతున్నారు. ఇందులో తక్కువ వయస్సు ఉన్న వారు కూడా ఉన్నా రు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో చిన్నారులకు అంతగా ప్రభావం చూపని వైరస్ ఇప్పుడు పిల్లలపైనా చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇందులో భాగంగా మొదటగా 15 ఏండ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చేందుకు సర్కారు రంగం సిద్ధం చేసిం ది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నది. ఆ మేరకు జిల్లాలోనూ వైద్యారోగ్య శాఖ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. 15 నుంచి 18 ఏండ్లలోపు వారందరికీ కొవిడ్ టీకాలు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, ఉప కేంద్రాల వారీగా ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. కేం ద్రం వెల్లడించిన నిర్ణీత వయస్సు కలిగిన బాల, బాలికల వివరాలను విద్యాశాఖ సహకారంతో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్నది. 9, 10 తరగతులతోపాటు ఇంటర్, ఐటీఐ చేస్తున్నవారందరి వివరాలను సేకరించారు. తదనుగుణంగా టీకాలకు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3లక్షలలోపు బాల, బాలికలకు వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
నిర్లక్ష్యంతో ముప్పు తప్పదు
కొవిడ్ -19 మార్గదర్శకాలను ప్రజలంతా బాధ్యతగా పాటించాలని కోరుతున్నాం. థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్న సమయంలో భౌతిక దూరం, మాస్కుల వాడకం తప్పనిసరి. లేదంటే నిర్లక్ష్యం మూలంగా మరోసారి ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసేందుకు పాటుపడుతున్నాం. టీకాలపై అపోహలు వీడి ప్రజలు సహకరించాలని కోరుతున్నాం.