Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో 27 నుండి తృతీయ పుష్కర మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో కమిటీ సభ్యులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ కామారెడ్డి అయ్యప్ప ఆలయ 36వ మండల పూజ సందర్భంగా ఈ నెల 27నుంచి 31 వరకు తృతీయ పుష్కర మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జిల్లా కేంద్రంలోని ధర్మశాల నుంచి మహిళలు నది జలాలను కలిశాలతో అయ్యప్ప ఆలయం వరకు తీసుకు వస్తారని తెలిపారు. ఈనెల 27 నుంచి ప్రతీ రోజు ఉదయం 75 జంటలతో శత చండీ హోమము, 30 వరకు రోజు రాత్రి 8:30 కు హంస వాహనము, పులి వాహనము, గజవాహనము, అశ్వవాహనములతో స్వామివారి ఊరేగింపు నిర్వహించబడునని తెలిపారు.
30న ఉదయం ఏడు గంటలకు అయ్యప్ప ఆలయం నుండి ఆభరణాల ఊరేగింపు, 31న శతకలుష కుంబాభిషేకాలు, సాయంత్రం స్వామి వారి ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రతీరోజు మధ్యాహ్నం అన్నదానం రాత్రి అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం రమేష్, అన్నదాన సేవా సంఘం అధ్యక్షుడు మానస రాజేందర్, నూకల ఉదయ్, కుంబాల రవి యాదవ్,పంపరి లక్ష్మణ్, నక్క శ్రీనివాస్ అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.