
బొమ్మలరామారం, డిసెంబర్ 22 : మండలంలోని కంచల్తండా ఓ మారుమూల పల్లె. ఆ తండాకు రోడ్డు సరిగా లేకపోవడంతో ఆటోలు, బస్సులు కూడా వచ్చేవి కాదు. విద్యార్థులు, గ్రామస్తులు రోజువారీ విధులకు హాజరు కావాలంటే చీకటిమామిడి వరకు 2.4 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. అక్కడి నుంచి బస్సులు, ఆటోల ద్వారా ఇతర గ్రామాలు, పట్టణాలకు వెళ్లేవారు. వారి ఇబ్బందిని తెలుసుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి జిల్లా మినరల్ ఫండ్ నుంచి చీకటిమామిడి నుంచి కంచల్తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.15 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో బీటీ రోడ్డు పనులు చకచకా జరుగుతున్నాయి. స్వతంత్ర భారతంలో ఆ గ్రామానికి మొదటి రోడ్డు కావడం విశేషం. కాగా, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నిత్యం అవస్థలు పడుతూ ప్రయాణించేవారికి బీటీ రోడ్డు అందుబాటులోకి రానుండడంతో తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
15 రోజుల్లో పనులు పూర్తి..
ఇన్నాళ్లూ ఇబ్బంది పడిన తండావాసుల కల త్వరలోనే నెరవేరనున్నది. చీకటిమామిడి నుంచి కంచల్తండా వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు 80 శాతం పూర్తయ్యాయి. మిగతా పనులను 15 రోజుల్లో పూర్తి చేసేలా వేగవంతం చేశాం.
గత పాలకులు పట్టించుకోలేదు
ఇన్నాళ్లూ గుంతల రోడ్డుతో ఇబ్బంది పడ్డాం. త్వరలోనే బీటీ రోడ్డు పూర్తికానున్నది. దాంతో ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. గత పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప తండాల అభివృద్ధికి కృషి చేయలేదు. తండా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డికి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు.