
ఖమ్మం వ్యవసాయం, జనవరి 7 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రాపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు. కర్షకుల ఇళ్ల ముందు ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. రైతులు, రైతు కూలీలు పంట పొలాలల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కేక్ కట్ చేసుకొని సంబురాలు చేసుకున్నారు. కల్లూరు మండలంలో రైతులతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతు బంధు వారోత్సవాల్లో పాల్గొన్నారు. వివిధ పంట ఉత్పత్తులతో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించి మానవహారం నిర్వహించారు. తొలుత ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కారేపల్లి, ఏన్కూరు మండలాల్లో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ముగ్గులను పరిశీలించి మహిళలు, రైతులను అభినందించారు. మధిర నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావుతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. బోనకల్ మండలం రావినూతల, చింతకాని మండలం చిన్నమండవ గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
రూ.272 కోట్లకు చేరిన రైతు బంధు
యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు బంధు సొమ్ము పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 2,92,174 మంది రైతుల ఖాతాల్లో రూ. 272.99 కోట్లు జమ అయ్యింది. ఈ నెల10వ తేదీలోపు మిగిలిన రైతుల ఖాతాలో సొమ్ము జమ కానున్నది. ఈ ఏడాది యాసంగి సీజన్‌కు 3,16,422 మంది రైతులకు రూ.362.84 కోట్లు మంజూరయ్యాయి.