
పాలమూరు మట్టి పరిమళం సాయిచంద్‌కు ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ
సమయంలో తన గొంతుకతో తెలంగాణవాదులను చైతన్యపర్చారు. రాష్ట్ర సాధన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరఫున తన పాటతో ప్రచారం చేశాడు. ఉద్యమ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేశాడు. అంతటి గొప్ప కళాకారుడిని వేర్ హౌస్ కార్పొరేషన్(వ్యవసాయ, సహకార శాఖ) చైర్మన్‌గా సీఎం కేసీఆర్ నియమించారు. పాటకు పట్టం కట్టడంతో ఆయన సొంతూరు అమరచింతతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణాన్ని జనవ్యాప్తం చేయడంలో చరిత్ర మరువబోని తెలంగాణ ముద్దు బిడ్డ సాయిచంద్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చింది. సాయిచంద్‌ను వేర్ హౌస్ కార్పొరేషన్ (వ్యవసాయ, సహకార శాఖ) చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సాయిచంద్ ఉద్యమంలో తన గళంతో సమైక్య పాలనకు వ్యతిరేకంగా పోరు సాగించారు. ‘నిండుగా గోదావరినే’ అంటూ కాళేశ్వరాన్ని కళ్ళముందుంచినా.., ‘ఓరి తీట మాటల రేవంతూ’ అంటూ ఉక్రోషం చూపినా.., ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా’ అంటూ ఉద్వేగం నింపినా.. తన పాట మాటలతో ప్రజల గుండెలను కదిలించి ప్రభావితం చేయగల నేర్పరి సాయిచంద్. తను పాట పాడుతుంటే సహజత్వం, మాటాడితే గొప్ప వాక్చాతుర్యం, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యమ గొంతుకై, డప్పుదరువులతో ఊపు తెచ్చిన వ్యక్తి సాయిచంద్. తెలంగాణ యాస, గోసని తన గొంతులో దాచుకొని, అవే ఆయుధాలుగా చేసుకొని పోరాడిన పోరుబిడ్డ. పాలమూరు ఉద్యమ బిడ్డకు సీఎం కేసీఆర్ నిజమైన గుర్తింపు నిచ్చారు. గిడ్డంగుల సంస్థకు చైర్మన్‌గా నియమించి పాటకు పట్టం కట్టారు.
ఉద్యమం కోసమే పోరాటం..
తెలంగాణ ఉద్యమంలో 2009లో శ్రీకాంతాచారి మరణం తర్వాత ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మిట్టపల్లి సురేందర్ రాసిన రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా.. అంటూ సాయిచంద్ పాడిన పాటకు కేసీఆర్ చలించిపోయారు. అమరుల త్యాగాలను గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్‌కు సాయిచంద్‌పై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఉద్యమంలో సాయిచంద్ ఊరూరా గజ్జకట్టి తిరిగాడు. గోరెటి వెంకన్న రచించిన రాములోరి సీతమ్మ.. ఉర్రూతలూగించాడు. అనేక ఉద్యమ గీతాలతో రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించాడు. రాష్ట్ర సాధన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఊరూరా తిరిగి తన పాటతో ప్రచారం చేశాడు. ఉద్యమ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యతను ఓటర్లకు తెలియజేశాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జాతీయ పార్టీలు, సమైక్యాంధ్ర పార్టీలు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేశాయో ప్రజలకు వివరించాడు. సాయిచంద్ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. సాయిచంద్‌కు పదవి లభించడంతో ఆయన స్వగ్రామమైన వనపర్తి జిల్లా అమరచింతలో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.