
పోలీసుల అదుపులో నిందితులు
అందోల్, జనవరి 2 : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం జోగిపేటలో సీఐ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గొర్రెకల్‌కు చెందిన అశోక్(28) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బోడ రాజు తండ్రి రామయ్య, బోడ రాజు తండ్రి బాలయ్య, ఉసిరికపల్లి రమేశ్, ఆత్కూరి నాగరాజుతో అశోక్‌కు గొర్రెల వ్యాపారం ఉంది. ఇటీవల గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతర సమయంలో వీరి మధ్య గొడవలు జరిగాయి. దీనికి తోడు నిందితుల్లో ఒకరి భార్యతో అశోక్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో అశోక్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. గత నెల 28న మృతుడు అశోక్ పొలంలో ఉండగా నలుగురు నిందితులు అక్కడికి వెళ్లి అశోక్ గొంతు నొక్కి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అశోక్ మృతదేహాన్ని నలుగురు కలిసి ద్విచక్ర వాహనంపై పోతులబొగుడకు తీసుకెళ్లి నిందితుడు అంబయ్య అత్తగారింట్లో కర్రకు తగిలించి ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. అశోక్ మృతిపై అనుమానం రావడంతో వట్పల్లి పోలీసులు పూర్తి వివరాలు సేకరించి ఆదివారం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. సమావేశంలో వట్పల్లి, పుల్కల్ ఎస్సైలు దశరథ్, నాగలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.