వెంగళరావునగర్ : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై షఫీ తెలిపిన వివరాల ప్రకారం..ఎర్రగడ్డలోని సౌత్ శంకర్‌లాల్ నగర్‌కు చెందిన అమీనుద్దీన్, ఆయన భార్య రేష్మా బేగం కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఈ నెల 2వ తేదీన రేష్మాబేగం తండ్రి చనిపోవడంతో కుటుంబ సభ్యులంతా పాతబస్తీకి వెళ్లారు.
మంగళవారం తెల్లవారుజామున తిరిగి ఇంటి వచ్చారు. తలుపు తెరిచి ఇంట్లో చూసేసరికి సమాన్లంతా చిందవందరగా కనిపించాయి. బీరువా తెరిచి ఉండటంతో అందులో 4.5 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి కిటికీ గ్రిల్స్ తొలగించి ప్రేవేశించిన దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. బాధితులు ఎస్.ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.