చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే నల్లబంగారు నేలకు సరికొత్త కళ సంతరించుకున్నది. సింగరేణి సంస్థ ఏటేటా తన కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటూ ఉత్పత్తి, ఉత్పాదకతలో రికార్డులు సృష్టిస్తున్నది. తెలంగాణకు మణిహారంగా మారిన సంస్థ ప్రస్తుతం ఎల్లలు దాటి ఇతర రాష్ర్టాలకు విస్తరించింది. రాష్ట్ర ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తూ మహారత్న కంపెనీలకు దీటుగా సంస్థ అభివృద్ధి చెందుతున్నది. దేశంలోనే అత్యద్భుతమైన ప్రగతిని సాధించి బొగ్గు ఉత్పత్తితోపాటు ఇతర రాష్ర్టాల్లోనూ బొగ్గు బ్లాకులను కైవసం చేసుకున్నది. థర్మల్, సోలార్, జియో పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటూ దేశ, రాష్ట్ర అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నది. త్వరలో మరో మైలురాయిని అధిగమించనున్నది. నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నది. సింగరేణి సంస్థకు 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. నేడు సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక కథనం
ఆరు జిల్లాల్లో బొగ్గు నిక్షేపాలు…
గోదావరి ప్రాణహిత లోయ ప్రాంతాల్లో బొగ్గు నిల్వలను దేశ అవసరాల కోసం వెలికితీయడానికి వివిధ ప్రాంతాల్లో బొగ్గు తవ్వకాలను సింగరేణి చేపట్టింది. తొలుత 1889 సంవత్సరంలో ఇల్లెందు ఏరియాలో బొగ్గు తవ్వకాలు జరిపి 39 సంవత్సరాల తరువాత 1928లో బెల్లంపల్లిలో, 1937లో కొత్తగూడెంలో బొగ్గు గనులను ప్రారంభించారు. ఈ మూడు ఏరియాలు స్వాతంత్య్రం రాకముందే బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాగా స్వాతంత్య్రం తరువాత 1961లో మందమర్రి, రామగుండం ఏరియాలు, 1975లో శ్రీరాంపూర్, మణుగూరు ఏరియాల్లో, 1991లో భూపాలపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 11 ఏరియాల్లో వివిధ రకాల అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి జరుపుతోంది.
మహారత్న కంపెనీలకు దీటుగా….
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణి కాలరీస్ కంపెనీ గడిచిన ఏడేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించి రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు తలమానికంగా నిలిచింది. ముఖ్యంగా అమ్మకాలు, లాభాల్లో సింగరేణి చరిత్రలోనే ఆల్‌టైం రికార్డులు, అత్యంత వృద్ధిరేటును సాధించి దేశంలోని 8 మహారత్న కంపెనీలకు దీటుగా నిలిచింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మేటిగా పేర్కొన్న భారీ పరిశ్రమలను మహారత్న కంపెనీలుగా కేంద్రం గుర్తిస్తుంది. ఇటీవల పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను కూడా ఇందులో చేర్చారు. దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోలిండియా లిమిటెడ్, ఓఎంజీసీ, ఎన్టీపీసీ, గెయిల్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బీహెచ్ఈఎల్ కంపెనీలు ఉన్నాయి. గడిచిన ఆరేళ్ల కాలంలో ఈ మహారత్న కంపెనీల లాభాలు, అమ్మకాల్లో సాధించిన వృద్ధి రేటుతో పోలిస్తే సింగరేణి సంస్థ ఇందుకు దీటుగా నిలిచింది. లాభాల్లో వృద్ధి రేటును పరిశీలిస్తే మహారత్న కంపెనీల్లో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ గత ఆరేళ్లలో లాభాల్లో 140 శాతం వృద్ధి సాధించగా సింగరేణి 118శాతం వృద్ధి సాధించి రెండవ స్థానంలో నిలిచింది. మిగిలిన సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 52 శాతం, గెయిల్ ఇండియా 51 శాతం, కోలిండియా లిమిటెడ్ 11శాతం వృద్ధిని సాధించగా మిగిలిన ఎన్టీపీసీ, సెయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లు లాభాలను సాధించలేదు.
సింగరేణిలో ఆధునిక టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తి
సింగరేణి సంస్థలో తట్టాచమ్మాస్తోబొగ్గు ఉత్పత్తి చేస్తున్న కాలంలో ప్రమాదాలు అధికంగా జరిగి బొగ్గు ఉత్పత్తి కష్టంగా ఉండేది. అంచెలంచెలుగా అత్యాధునిక టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తి చేస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను ఆధునీకరించుకుంటూ ముందుకుపోతోంది. 1948 సంవత్సరంలో జాయ్లోడర్ షెటిల్ కార్లను ప్రవేశపెట్టి యాంత్రీకరణకు శ్రీకారం చుట్టిన సింగరేణి ఆధునిక పరికరాలు, యంత్రాలను తొలిసారిగా ప్రవేశపెట్టిన సంస్థగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వివిధ రకాల అత్యాధునిక టెక్నాలజీతో బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. పవర్ డంపర్ కాంబినేషన్‌తో ఎక్కువ ఓసీల్లో ఉత్పత్తి సాగుతోంది. ఇన్పిట్క్రషర్ అండ్ కన్వేయర్ విధానం, డ్రాగ్‌లైన్ ఎక్యూప్మెంట్ ఓవర్‌బర్డెన్ తొలగింపు విధానం, సర్ఫేస్ మైనర్ ద్వారా కాలుష్య రహిత బొగ్గు ఉత్పత్తి విధానం, హైవాల్ మైనింగ్ విధానం లాంటివి సింగరేణిలో అమలుపరుస్తున్నారు. సైడ్ డిచార్డ్ లోడర్(ఎస్డీఎల్), లోడ్ హాల్ డంపర్ (ఎల్‌హెచ్‌డీ)లను ప్రవేశపెట్టి బొగ్గు ఉత్పత్తి పెంచడమే కాకుండా ఉత్పత్తి జరిగే ప్రదేశాల్లో ప్రమాదాలను పూర్తిగా తగ్గించగలిగింది. కంటీన్యూయస్ మైనర్(సీఎంఆర్)తో బ్లాస్టింగ్ గ్యాలరీ, బొగ్గు ఉత్పత్తి విధానాన్ని సింగరేణిలో అమలుచేస్తోంది. ముఖ్యంగా పూర్తి రక్షణతో అధిక ఉత్పత్తి సాధించే లాంగ్వాల్ విధానాన్ని ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద లాంగ్వాల్ మైనింగ్ విభాగాన్ని రామగుండం 3 ఏరియాలోని అడ్రియాలా లాంగ్వాల్ గనిలో ఏర్పాటు చేసింది.