నిజామాబాద్‌సిటీ, డిసెంబర్ 23: దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రమ వెలకట్టలేనిదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మన దేశంలో వ్యవసాయానికి ఎంతో ప్రధాన్యత ఉందని, అన్నదాతల కృషిని మరువలేమని పేర్కొన్నారు. నగరంలోని మార్కెట్ యార్డులో జాతీయ రైతు దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ హాజరై జిల్లాలోని పలువురు రైతులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో ఇతర పంటలు సాగుచేయాలని సూచించారు. వానకాలం సీజన్లో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డుస్థాయిలో సేకరించామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గుర్తుచేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జేడీ ఇఫ్తెకార్, జిల్లా మార్కెట్‌యార్డు సెలక్షన్‌గ్రేడ్ కార్యదర్శి వెంకటేశం, ఏడీఎం గంగు, డీఎంఐ లక్ష్మీబాయి, కార్యదర్శి విజయ్‌కిశోర్, మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రాంపూర్‌లో రైతు దినోత్సవం
డిచ్పల్లి, డిసెంబర్ 23: మండలంలోని రాంపూర్ గ్రామంలో జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుపతిని ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఉప సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ సుజాతారవి, రైతులు పాల్గొన్నారు.