
ఇంటర్మీడియట్ బోర్డు గురువారం ప్రకటించిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ. ఖమ్మం జిల్లా నుంచి 17,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,077 మంది ఉత్తీర్ణులయ్యారు. భద్రాద్రి జిల్లా నుంచి 8,082 మంది పరీక్షలు రాయగా 3,802 మంది ఉత్తీర్ణులయ్యారు. ఖమ్మం జిల్లాలో 51శాతం, భద్రాద్రి జిల్లాలో 49శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎంపీసీలో మద్ది మనీష 467 మార్కులు, లోద్ పూజిత 467, శ్యామ్ సుందరాచారి 463, బైపీసీలో లాస్య సరోజిని 436 మార్కులు, రూపాంబిక 436 మార్కులు సాధించి జిల్లాఖ్యాతిని ఇనుమడింపజేశారు.- ఖమ్మం
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 16: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు గురువారం ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ప్రకటించింది. భద్రాద్రి జిల్లాలో 49శాతం, ఖమ్మం జిల్లాలో 51శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఖమ్మం జిల్లా నుంచి 17,893 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 9,077మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ కోర్సులో బాలురు 7,548 మందికి 3432 మంది, బాలికలు 7582 మందికి 4,197మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా బాలురు 45 శాతం, బాలికలు 55 శాతంగా ఉత్తీర్ణత నమోదు చేశారు. ఒకేషనల్ కోర్సుల్లో 2,763 మందికి 1,448 మంది ఉత్తీర్ణులయ్యారు. 52శాతం ఉత్తీర్ణత నమోదైంది.
టాప్ మార్కులు సాధించిన విద్యార్థులు…
శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు చెందిన మనీషా ఎంపీసీ విభాగంలో 467 మార్కులతో స్థాయిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. న్యూవిజన్లో బైపీసీలో లాస్య సరోజిని 436 మార్కులు సాధించిందని చైర్మన్ చుంచు గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. డాక్టర్స్ మెడికల్ అకాడమీకి చెందిన రూపాంబిక బైపీసీలో 436 మార్కులు సాధించినట్లు అకాడమి చైర్మన్ రాయల సతీశ్‌బాబు తెలిపారు.
ప్రభుత్వ కళాశాల విద్యార్థికి 463 మార్కులు..
ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న శ్యామ్ సుందరాచారి అనే విద్యార్థి ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 463 మార్కులు సాధించాడు. గణితం రెండు పేపర్లలో 75 మార్కులు, ఫిజిక్స్‌లో 60 మార్కులు, కెమిస్ట్రీ 59, తెలుగు 99 మార్కులు, ఇంగ్లిష్‌లో 95 మార్కులు సాధించాడు. విద్యార్థిని ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్, డీఐఈవో రవిబాబు అభినందించారు.
రీకౌంటింగ్‌కు 22 వరకు గడువు..
పరీక్ష ఫలితాల్లో అభ్యంతరాలున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈనెల 22వ తేదీలోగా ఫీజు చెల్లించవచ్చని డీఐఈవో రవిబాబు తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో 49 శాతం ఉత్తీర్ణత
ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల్లో భద్రాద్రి విద్యార్థులు 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా 8,082 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,802 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 1456 మంది, బాలికలు 2346 మంది ఉన్నారు. ఒకేషనల్‌లో 2,738 మంది పరీక్షకు హాజరుకాగా 1,539 మంది ఉత్తీర్ణులయ్యారు.