
మగరాయుడిలా బండి నడుపుతవు ఎందుకని ఒకరు! కొండలెక్కి.. ఏ కాలో చెయ్యో విరిగితే పెండ్లెవరు చేసుకుంటరని ఇంకొకరు!! బుద్ధిగా చదువుకోక ఆడపిల్లకు ఈ సాహసాలెందుకమ్మా అంటూ మరొకరు!! ఇలాంటి సూటిపోటి మాటలు, అక్కరలేని ఓదార్పులేవీ ఆమె సంక్పలాన్నిదెబ్బతీయలేకపోయాయి. వాటినే సోపానాలుగా మార్చుకుని శిఖరాగ్రాన కీర్తి పతాక ఎగురవేసింది. మంచు తుఫాను.. మైనస్ 40 డిగ్రీల చలి.. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు.. అర్ధరాత్రి ప్రయాణం.ఏడు కేజీల లగేజీ.. ఒక్కో అడుగు ముందుకు పడుతున్నకొద్దీ తగ్గిపోయే ప్రాణవాయువు. ఎటుచూసినా మంచు పర్వతాలే.. తాగేందుకు చుక్క నీరూ ఉండదు. ఇలాంటి అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ లక్ష్యం చేరుకుని ఆమె అనితరసాధ్యురాలిగా నిలిచింది. భువనగిరికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి యూరప్ ఖండంలోనే అతి ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని తాజాగా అధిరోహించి అనేక రికార్డులు సృష్టించారు. రష్యాలో 5,642 మీటర్ల ఎత్తులో ఉండే ఈ శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి సాధారణంగా 8 గంటల సమయం పడుతుంది. అన్విత మాత్రం 5 గంటల 10 నిమిషాల్లో సమ్మిట్‌ను పూర్తి చేశారు. వింటర్లో ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించినతొలి భారతీయమహిళఅన్వితనే.
యాదాద్రి, డిసెంబర్ 11 : అష్టదిక్పాలకులు, దిగ్దేవతలు.. అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వాహనాలు, వారి పరివార దేవతల ప్రతిమలతో యాదగిరికొండపై గుహలో వెలిసిన లక్ష్మీసమేత నారసింహుడి పంచతల విమాన గోపురం స్వర్ణకాంతులతో భక్తులను దర్శనమివ్వనుంది. యాదగిరిగుట్టను ఆస్థానంగా చేసుకుని పరిపాలిస్తున్న మహారాజ నారసింహుడికి పసిడి కిరీటం భక్తులకు దర్శనమివ్వనున్నది. దాదాపుగా రూ. 1,100 కోట్లతో పూర్తి కృష్ణశిలలతో పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న స్వయంభువుని కోవెల వచ్చే ఏడాది మార్చి 28న పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో గర్భాలయ విమాన గోపురానికి చేయించనున్న స్వర్ణ తాపడంలో భాగస్వామ్యమయ్యే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరికీ కల్పించారు. సీఎం పిలుపు మేరకు ఇప్పటికే పలువురు నాయకులు, భక్తులు స్వర్ణ తాపడపానికి రూ.8.8 కోట్ల నగదు, 2.233కిలోల బంగారం సమర్పించుకున్నారు. దిగ్దేవతలు వెలసిన దివ్య విమానంలో భాగస్వాములు కావడం మహాదృష్టమని స్తపతులు, ఆలయ అధికారులు చెబుతున్నారు.
సకల దేవతలు కొలువై ఉండే దివ్య విమానం..
సకల దేవతలు కొలువై ఉండేదే ‘విమానం’. సాలహారాల్లో లోపల ఉన్న స్వామివారి ప్రతిరూపాలు మాత్రమే వస్తాయి. కానీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిమలు కనిపించవు. విష్ణుపరివార దేవతలు, విష్ణుమూర్తికి సంబంధించిన ఆళ్వారులు, విష్ణుమూర్తి దశావతారాలు, విష్ణు సహస్రనామాలు మాత్రమే ఉంటాయి. కానీ విమానంలో సకల దేవతలు కొలువై ఉంటారు. దేశంలో ఉన్న ఆలయాలకు గర్భాలయాన్ని రాతితో నిర్మించి, విమానాన్ని సిమెంటుతో నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గోపురాలన్నీ గర్భాలయం వరకు శిలతో నిర్మించి, పైభాగమంతా సిమెంటుతోనే నిర్మించారు. కానీ, యాదాద్రి నారసింహుడి పంచతల దివ్య విమానం పూర్తిగా కృష్ణశిలతో నిర్మించారు.
అష్ట దిక్పాలకులు, దిగ్దేవతలు ఇలా…
నారసింహుడు స్వయంభువుడిగా కొలువైన గర్భాలయ విమాన గోపురానికి తూర్పు ముఖంగా ఇంద్రుడు, పడమర వరుణుడు, ఉత్తరదిక్కున కుబేరుడు, దక్షిణ దిక్కున యముడు, ఆగ్నేయంలో అగ్ని, నైరుతిలో నిరుతి, వాయువ్యంలో వాయుదేవుడు, ఈశాన్యంలో శివుడు, దిగ్దేవతలు.. తూర్పున నరసింహస్వామి, పడమర బ్రహ్మదేవుడు, దక్షిణంలో శివుడు, ఉత్తరంలో వరాహమూర్తి, రెండు అంతస్తుల్లో విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి. విమానం అంతస్తులను బట్టి దేవతాస్థానాలను నిర్ణయిస్తారు.
2.433 కిలోల బంగారం సేకరణ..
125 కిలోల బంగారంతో నిర్మించనున్న యాదాద్రీశుడి గర్భాలయ విమాన తాపడానికి సుమారు రూ. 65 కోట్లు సేకరించాల్సి ఉన్నది. సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 6 వరకు రూ.8,88,85, 856 నగదు విరాళం స్వామివారి బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల ద్వారా రూ.2,49,85,939, ఆర్టీజీఎస్ నెఫ్ట్, క్యూ ఆర్ కోడ్, ఆన్లైన్ ద్వారా రూ.1,37,68,743, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, దానం నాగేందర్ కుటుంబ సభ్యులతో పాటు ఇతర భక్తులు అందించిన డీడీల ద్వారా రూ. 4,99,84, 956 నగదు, హుండీ ద్వారా రూ.1,46,218 విరాళాలతో పాటు 2.433 కిలోల బంగారం చేరింది.
పంచతల విమానం
విమానం అనేది ఏకతల, ద్వితల, త్రితల, పంచతల, సప్తతలలుగా ఉంటాయి. స్వామివారి విగ్రహ రూపం, వారి పరివారాన్ని బట్టి గర్భగుడి, మానసూత్రాన్ని బట్టి శిఖరం ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు మాత్రమే నిలబడి ఉంటే ఏకతల విమానం నిర్మిస్తారు. స్వామివారు అమ్మవారితో ఉన్న సమయంలో త్రితల విమానం, గుహల్లో స్వామివారు ఉంటే పంచతల విమానం నిర్మిస్తారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారు గుహలో స్వయంభువులుగా వెలిసినందున పంచతల విమానం నిర్మించారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చేందుకు మాత్రం సప్తతల రాజగోపురం నిర్మించారు.
పసిడి వర్ణపు విమానం..
రాజు వజ్ర, వైఢూర్యాలతో కిరీటం ధరిస్తాడు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి రాజుగా భక్తులకు పరిపాలిస్తున్నాడు కాబట్టి విమానానికి బంగారు తాపడం చేయించారు. విజయవాడలో దుర్గామాతకూ కిరీటం ఉన్నది. దైవాన్ని దగ్గరగా చూడలేం. స్వామివారిని బంగారు స్వరూపంలో చూడడమంటే బంగారు తాపడం కలిగిన విమానంను దర్శించడమే. భక్తులు విమానాన్ని దర్శనం చేసుకుని దేవుడిని చూసిన ఆనందం పొందుతారు. భక్త ప్రహ్లాదుడి కోసం యాదగిరిగుట్టలో స్వయంభువుడిగా వెలిసిన నారసింహస్వామి రాజుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ కొలిచిన వారికి కొంగుబంగారం అవుతున్నాడు. అలాంటి రాజుకు స్వర్ణవర్ణపు కిరీటం ధరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం తీసుకున్నది.
స్వర్ణ తాపడంలో భాగస్వామ్యం కావడం భక్తుల అదృష్టం
సీఎం కేసీఆర్ ప్రకటనతో విరాళాలు ఇచ్చేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం బ్యాంకు ఖాతాను తెరిచి అందుబాటులోకి తెచ్చాం. ఆన్లైన్లో విరాళాలు అందజేసే భక్తులకు ప్రత్యేకమైన క్యూ ఆర్‌కోడ్, నేరుగా విరాళం అందజేసే భక్తులకు హుండీని ఏర్పాటు చేశాం. చెక్కులు, డీడీలు, నగదు, బంగారం నాణేలను ఆలయానికి వచ్చి నేరుగా అందజేయవచ్చు. నేరుగా ఇచ్చిన భక్తులకు రసీదు అందిస్తున్నాం.
-ఎన్. గీత, ఆలయ ఈఓ
భాగస్వామ్యం కావడం అదృష్ట కార్యం..
స్వయంభువుడిగా వెలిసిన స్వామివారి గర్భాలయానికి 58 అడుగుల ఎత్తులో విమాన గోపురం నిర్మించాం. విమానంపై బంగారు కలశం ఆకాశంలో ఉన్న అతీతశక్తిని గ్రహించి గర్భాలయానికి విడుదల చేస్తుంది. ఆ సమయంలో స్వామివారి సుప్రభాత సేవను నిర్వహిస్తారు. గర్భాలయంలో పెట్టే ప్రతి వస్తువూ శక్తివంతంగా, పరమ పవిత్రంగా మారుతుంది. అదే సమయంలో స్వామివారికి ధూప దీప నైవేద్యం, హారతులు, తీర్ధప్రసాదాలు అందిస్తారు. శక్తివంతమైన విమానగోపురం స్వర్ణ తాపడం నిర్మాణంలో భాగస్వాములు కావడం ఎంతో అదృష్టం.