రంగారెడ్డి జిల్లా కోర్టులు : మానవ సంబందాలన్ని ఆర్థిక సంబంధాలే అన్న నానుడి నిజమయింది. కన్నపేగు బంధం కంటే ఆస్తులే వారికి ముఖ్యమయ్యాయి. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కూతురు కనికరం లేనిదయింది. తన జీవి తాంతం కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఇల్లును తన ఒక్కగానొక్క కూతురుకు గిఫ్ట్‌గా ఇచ్చారు ఆ తల్లి దండ్రులు ఇదే వారి పాలిట శాపం అయింది.
వివరాల్లోకి వెలితే నాచారంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన గాలిదేవర రామకృష్ణ, అచ్యుతాంబ భార్యాభర్తలు వారికి లక్ష్మి అనే కూతురు ఉంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు పెళ్ళి ఘనంగా చేశారు. ఆ కూతురు వృద్ధాప్యంలో అండగా ఉండి బాగోగులు చూసుకుంటానని వారికి హమీ ఇచ్చింది. ఎంతైన కన్న కూతురు కదా నమ్మారు.
దీంతో వారి పేరుపై ఉన్న 170 గజాల ఇంటిని వారి కూతురుకు గిఫ్ట్‌డీడ్ చేసారు. అనంతరం కొంత కాలం బాగానే ఉన్నారు, ఆ తరువాత కూతురు లక్ష్మి వారిని వేధించడం ప్రారంబించింది. ఆపదలో ఆదుకుంటుందనుకున్న కూతురే వేధించడంతో తీవ్ర మానసికవేదనకు గురయ్యారు వృద్దులు.
తన కూతురుకు గిఫ్ట్‌గా రాసిఇచ్చిన తమ ఇంటిని తిరిగి కూతురు ఇచ్చేవిధంగా చేయాలని రంగారెడ్డి జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి శ్రీమతి శ్రీదేవిని కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సంస్థ కార్యదర్శి సీనియర్ సిటిజన్ చట్టం కింద దర్యాప్తు జరపాలని కీసర ఆర్డీవోను ఆదేశించింది.
ఆర్డీవో వృద్దులను, వారి కూతురు లక్ష్మిని పిలిచి కౌన్సిలింగ్ చేశారు. అయినా సెటిల్ కాకపోవడంతో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. అనంతరం పూర్తి వివరాలను సంస్థ కార్యదర్శి శ్రీదేవికి తెలుపగా నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి వృద్ధుల పేరతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో వారి పేరుపై తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు.
ఆ వృద్ధులు న్యాయమూర్తి రంగారెడ్డి జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి శ్రీదేవిని కలసి కృతజ్ణతలు తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో పేదలకు, మహిళలకు, వృద్దులకు ఉచితంగా న్యాయసహయం చేస్తామని అవసరమైన వారు సంస్థ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.