
యావత్ తెలుగు రాష్ర్టాల్లోనే ఖమ్మం మార్కెట్లో గరిష్ఠ ధర పలుకుతుండడంతో పొరుగు జిల్లాల రైతులు ఇక్కడి మార్కెట్‌కు భారీగా పత్తి పంటను తీసుకొస్తున్నారు. నగర వ్యవసాయ మార్కెట్లో పతి ్తపంటను కొనుగోలు చేసేందుకు ఖరీదుదారులు, పొరుగు రాష్టాల వ్యాపారులు పోటీపడుతున్నారు. పత్తి సాగు అధికంగా జరిగే గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో పంట నాణ్యత తగ్గడంతో తెలంగాణ పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి పంటను తమ రాష్ర్టాలకు ఎగుమతి చేసి అక్కడి పంటతో కలిపి జిన్నింగ్ చేసుకుంటున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే క్వింటాల్‌కు రూ.10 వేలకు చేరుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. పత్తి బంగారమాయేనే ఈ సారి పత్తి సాగు కర్షకులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ పలుకుతుండడంతో రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. నీటి వనరులు, సాగుకు అనువైన నేలలు ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టడంతో భారీగా పత్తి దిగుబడి వస్తున్నది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 1.88 లక్షల ఎకరాలు, భద్రాద్రిలో 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. నాణ్యమైన పత్తి మార్కెట్‌కు వస్తుండడంతో ధర పెరుగుతున్నదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర మార్కెట్లలో నిన్నటి వరకు పత్తి క్వింటాల్‌కు రూ. 8,500 ఉన్నది. ఖమ్మం ఏఎంసీ, జూలూరుపాడు సబ్‌మార్కెట్ యార్డులో గురువారం క్వింటాల్‌కు రూ.9,100 ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తొలిసారిగా క్వింటాల్ రూ.9,100
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం మార్కెట్లో పత్తికి ధర పలుకుతున్నది. భారత పత్తి సంస్థ (సీసీఐ) మద్దతు ధర ప్రకటించి కొన్నేళ్లుగా పత్తి పంటను కొనుగోలు చేసున్నా.. ఈ సారి భిన్నంగా ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ కంటే అధిక ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేయడం విశేషం. గతేడాది సీసీఐ పంటకు గరిష్ఠ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,750 ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేశారు. కానీ ఈ ఏడాది పంట సీజన్ ప్రారంభం నుంచే ప్రైవేట్ వ్యాపారులు మంచి ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేస్తున్నారు. దీంతో తెల్లబంగారం రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. మంగళవారం ఉదయం జరిగిన జెండా పాటలో పత్తి క్వింటాల్ మరోమారు ఆల్‌టైం రికార్డు సృష్టించింది. క్వింటాల్ రూ.9,100 గరిష్ఠ ధర పలికింది. వివిధ జిల్లాల నుంచి రైతులు సుమారు 6 వేల బస్తాలను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్ 30.(నమస్తేతెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏటా విస్తారంగా పత్తి సాగు జరుగుతున్నది. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు పెంచుతుండడం, పత్తి సాగులో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్ల నుంచి ఏటా లక్ష ఎకరాలకు పైగా పత్తి సాగు చేస్తున్నారు. ప్రభుత్వం డిమాండ్‌ను బట్టి ఏటికేడు గిట్టుబాటు ధరలు పెంచుతుండడంతో రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు రైతుబంధు సాయం సీజన్‌కు అందుతుండడంతో రైతులకు సాగు సులువైంది. ఈ ఏడాది ఏకంగా సాగు విస్తీర్ణాన్ని 1.60 లక్షల ఎకరాలకు పెంచారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.9 వేలకు పైగా పలుకుతుండడంతో వచ్చే ఏడాది కూడా పత్తి సాగు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు క్వింటాకు రూ.8,500 పలుకగా గురువారం ఏకంగా రూ.9,100కు చేరుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ధరలు చూడలేదని, పత్తి సాగుపై దృష్టి సారిస్తామని రైతులు వెల్లడిస్తున్నారు.
రైతుల్లో సంతోషం
పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతుల మోముల్లో చిరునవ్వు కనిపిస్తున్నది. గతంలో ఎప్పు డూ ఇంత ధర పలకలేదు. పంట చేతికొచ్చినప్పటి నుంచి నేటి వరకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మన పంటను కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ర్టాల వ్యాపారులు పోటీపడుతున్నారు.
-డౌలే లక్ష్మీప్రసన్న , ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్
ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్నా..
ఎన్నో ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్నా. ఈ సారి ధరలు చూస్తుంటే సంతోషంగా ఉన్నది. పంటను తీసుకొచ్చేప్పుడు ఇంత ధర పలుకుతుందనుకోలేదు. నా పంటకు క్వింటాల్ రూ.8,400 పలుకగా.. మా ఊరి రైతు సావిళ్ల నర్సింహారావు పంటకు క్వింటాల్‌కు రూ.9,100 పలికింది. మన పంటకు ఇతర రాష్ర్టాల్లో మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
-కంచు బీరయ్య, రైతు, పెద్దమునగాల, కొణిజర్ల మండలం
18 బస్తాలు తీసుకొచ్చా
ఈ సారి చాలా మంది పత్తిని వదిలి మిర్చి సాగు చేశారు. నేను పత్తి పంటను మాత్రమే సాగు చేశా. దిగుబడి కొంతమేర తగ్గినా.. ధర రావడం సంతోషంగా ఉంది. నేను మార్కెట్‌కు 18 బస్తాలు తీసుకొచ్చాను. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.8,900 ధర పెట్టి కొన్నారు. నేను సాగు చేసినప్పటి నుంచి ఇంత ధర రావడం ఇదే మొదటిసారి.