ఖలీల్‌వాడి, డిసెంబర్ 23 : వస్తు వినిమయ వ్యవస్థలో వినియోగదారుడే రారాజు. వస్తుసేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారాన్ని పొందవచ్చు. ఎటువంటి రుసుము లేకుండా వినియోగదారుల ఫోరం (కోర్టు)లో కేసులు వేయవచ్చు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసేవారు వినియోగదారులు. కొనుగోలుదారు అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకునేవారు సైతం వినియోగదారులే. కాలాన్ని బట్టి మార్పులు వస్తున్నాయి. రోజురోజుకూ కొత్త టెక్నాలజీ వస్తున్న తరుణంలో నకిలీ వస్తువులు కూడా అధికమవుతున్నాయి. దీనిని అధిగమించడానికి వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా వాటిపై కేసులు వేసి పరిష్కరించవచ్చు. నిజామాబాద్ జిల్లాలో 2020-21 సంవత్సరంలో ఇప్పటి వరకు 235 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో టూ వీలర్, ఫోర్ వీలర్, వాటర్ ఫిల్టర్, గ్యాస్, రేషన్, పెట్రోల్ దుకాణాల పై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. షాపింగ్ మాల్స్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, హోటల్స్‌లో నాసిరకం ఆహారం అందిస్తున్నారని ఫిర్యాదువు వచ్చాయి. దీనిపై అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కులు, బాధ్యతల వివరాలు మీ కోసం..
భద్రత హక్కు
వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవలు తక్షణ అవసరాలు తీర్చేవిగానే కాకుండా దీర్ఘకాలికం గా ఉండాలి. వినియోగదారుల ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ఈ భద్రత పొందడానికి కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలి. వీలైనంత వరకు ఐఎస్ఐ, ఆగ్మార్క్ వంటి చిహ్నాలు ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలి.
సమాచారం పొందే హక్కు వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవల నాణ్యతా ప్రమాణాలు, ధరల గురించి సంపూర్ణ సమాచారం పొందవచ్చు.
వస్తువుల ఎంపిక హక్కు
అనేక రకాల వస్తువులు, సేవలను సరసమైన ధరల్లో పొందడం వినియోగదారుల హక్కు.అభిప్రాయం వినిపించే హక్కు వినియోగదారులు వినియోగదారుల వేదికలపై తమ అభిప్రాయాలను వినిపించవచ్చు. ప్రభుత్వం ఇతర సంస్థలు ఏర్పాటుచేసే పలు సంఘాల్లో ప్రాతినిథ్యం పొందగల రాజకీయేతర, వాణిజ్యతేర వినియోగదారుల సంఘాలను ఏర్పర్చుకోవడం కూడా ప్రాథమిక హక్కు.
న్యాయ పోరాటం
అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందడం వినియోగదారుల హక్కు. నష్ట పరిహారం జిల్లా వినియోగదారుల ఫోరం ద్వారా నష్ట పరిహారం రూ.20 లక్షల నుంచి రూ. కోటి వరకు, రాష్ట్ర కమిషన్ ద్వారా రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు పొందవచ్చు. రూ. 10 కోట్లు దాటితే జాతీయ వినయోగదారుల కమిషన్‌లో కేసులు వేసుకునే అవకాశం ఉంటుంది.
ఫిర్యాదు చేయడం ఎలా?
ఫిర్యాదు చేసే విధానం చాలా సులువు. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. ఏ న్యాయవాది అవసరం లేకుండా ఎవరైనా వినియోగదారుల సమాచార కేంద్రానికి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. అన్ని రకాల వస్తువులపై ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంది.
బాధ్యతలు
గుడ్డిగా ఏ వస్తువూ కొనవద్దు. ముందుగా కొనదలచిన వస్తువు గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. ఒక తెగకు చెందిన రెండు ప్యాకేజీల్లో దేనిలో నెట్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్నాయో చూసిన తరువాత కొనాలి. కాస్మోటిక్స్ ఉత్పత్తులపై తప్పనిసరిగా వస్తువు ధర, తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ, తయారుదారుల చిరునామా, వస్తువు బరువును ముద్రించాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎమ్మార్పీపై మరో స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి విక్రయించడం నేరం. మోసపూరిత ప్రకటనల విషయంలో జాగ్రత్త వహించాలి. వస్తువుల నాణ్యతపై రాజీపడొద్దు. నాణ్యమైనవే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే సమయంలో సరైన రసీదు అడిగి తీసుకోవాలి. కొన్ని వస్తువుల విషయంలో గ్యారంటీ, వారంటీ కార్డులను షాపు యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల ఫోరంలో (కోర్టులో) సమర్పించడానికి ఉపయోగపడుతాయి. నాసిరకం వస్తువులను విక్రయించిన వారిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు.
టోల్ ఫ్రీ నంబర్
వినియోగదారులు తమకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్లవచ్చు. హెల్ప్ లైన్ నంబర్ 14404 లేదా ఫోన్ చేసి సమాచారం ఇచ్చి సలహాలు పొందవచ్చు. వివరాలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉన్న వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయవార్ రాజేశ్వర్ (9396451999)నుసంప్రదించవచ్చు.
తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి
జిల్లాలో ఇప్పటి వరకు 235 పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో గ్యాస్ కనెక్షన్స్, పెట్రోల్ బంకులు, చౌక ధరల దుకాణాలు, ఆటోమొబైల్స్, నాసిరకం వస్తువులు, విత్తనాలు, ఎరువులు తదితర వాటిపై ఫిర్యాదులు రాగా, వెంటనే పరిష్కరించాం. వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే సమస్యను పరిష్కరించుకోవడానికి సులువు అవుతుంది.
-మాయవార్ రాజేశ్వర్,
నిజామాబాద్ జిల్లా వినియోగదారుల
సమాచార కేంద్రం చైర్మన్