
‘కేంద్రం దిగొచ్చి ధాన్యం కొనేదాక పోరాటం ఆగదు.. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుపై పగబట్టింది.వడ్లు కొనుగోలు చేయాలని రైతుల తరఫున ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందాన్ని అవమానిస్తారా..? ఎంత అహంకారం.. కర్షకుల ఓట్లు కావాలి, కానీ వారు పండించిన వడ్లు వద్దా.. ఇంత జరుగుతున్నా రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.. మోడీ సర్కార్‌కు గుణపాఠం తప్పదు’.. అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి, 300 పడకల జిల్లా దవాఖాన, మల్దకల్ పీహెచ్సీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఎడ్ల బండలాగుడు పోటీలను ప్రారంభించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ సర్కార్ తెలంగాణ రైతుపై పగ పట్టిందని, వడ్లు కొనకుం డా.. అడగడానికి వెళ్లిన మంత్రులను అవమానిస్తున్నారని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. జో గుళాంబ గద్వాల జిల్లాలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 300 పడకల జిల్లా దవాఖాన, నర్సింగ్ కాలేజీ నిర్మాణం, మల్దకల్ మండలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్దకల్లో కేసీఆర్ అన్నదాతల ఆత్మీయ సంబురాల సభా ప్రాంగణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 1969 నుంచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలన్నీ వడ్లు కొంటున్నాయని.. అదే తీరున మోడీ సర్కార్ కూడా కొనుగోలు చేయాలని అడిగితే కొనబోమని చెబుతున్నారన్నారు. రైతుల తరఫున మంత్రి నిరంజన్‌రెడ్డి బృందం ఢిల్లీ వెళ్లి మంత్రి పీయూష్ గోయల్‌ను వడ్లు కొనాలని అడిగితే.. మీకేం పని లేదంటూ.. అవమానిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ఇంత అహంకారం పనికిరాదంటూ విమర్శించారు. రైతుల ఓట్లు కావాలి కానీ వారిని పట్టించుకోరన్నారు. వడ్లు కొనబోమంటున్న బీజీపీ మనకు వద్దని, కేంద్రంలో గద్దె దించితేనే వడ్లు కొనే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు.
రైతులకు అవమానం..
మంత్రి నిరంజన్‌రెడ్డి బృందానికి జరిగిన అవమానం 70 లక్షల మంది తెలంగాణ రైతులది అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేం ద్రం తీరుకు రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ రైతుల కు అవమానం, నష్టం జరుగుతుంటే.. ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మౌనంగా ఉంటారా..? కేంద్రాన్ని నిలదీయరా..? ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి.. అవమానం జరుగుతుంటే.. సోయి లేకుండా ఉంటారా..? అని ప్రశ్నించారు. అలాంటి వారికి రైతులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రైతుల ఉసురు తగులుతుందని పేర్కొన్నారు. అన్నదాతల పోరాటానికి దిగొచ్చి మూడు చట్టాలను వెనక్కి తీసుకుని క్షమాపణ కూడా చెప్పారన్నారు. ఇప్పుడు ఢిల్లీ దిగి వచ్చేదాకా పోరాటం సాగుతుందన్నారు. రైతుబంధు, బీమా, ఉచిత కరెంట్, నీళ్లు.. ఇలా అన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని.. బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవమని, దానికి దెబ్బ తగిలితే ఊరుకోబోమన్నారు. కార్యక్రమం లో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్ర హం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఆరోగ్య శాఖ కమిషనర్ కరుణ, కలెక్టర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమేందిరో.. వాని పీకుడేందిరో..
రైతు పండించే ప్రతి గింజనూ కేంద్రం తరఫున ఎఫ్‌సీఐ కొనాలి. విభిన్న జాతులు, సాంప్రదాయాలు, నేలలు ఉన్న దేశంలో రకరకాల పంటలు పండుతాయి. ఒక ప్రాంతంలో పండే పంటను మరో ప్రాంతానికి ఎఫ్‌సీఐ తరలించి ప్రజల ఆహార అవసరాలు తీర్చాలి. రైతుబంధు పేరిట పెట్టుబడి అందిస్తూ వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా మార్చింది. కానీ కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అన్యాయం చేస్తున్నది. ఆహార భద్రత చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఎఫ్‌సీఐ ధాన్యం కొనాల్సిందే. తెలంగాణ మంత్రులు ఢిల్లీ వస్తే.. పని లేదా అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానిస్తున్నారు. ఢిల్లీ ఏమైనా మీ అబ్బ సొత్తా. రైతుల కోసం వచ్చిన మంత్రులను అవమానించడం తగదు. కేంద్రం ఏందిరో వాని పీకుడేందిరో.
వ్యవసాయం దండుగ కాదని నిరూపించారు..
సమైక్య రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేక వలసలు వెళ్లేవారు. విద్యుత్ కష్టాలు చెప్పే పరిస్థితి ఉండేది కాదు.. కరెంట్ కోసం నిత్యం సబ్స్టేషన్ల వద్ద ఆందోళన చేసేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం దండుగ కాదు పండుగని సీఎం కేసీఆర్ నిరూపించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందుతున్నది. ఈ ఘనత దేశంలో తెలంగాణలో మాత్రమే సాధ్యం. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్నదాతలు సుఖసంతోషాలతో ఉన్నారు. పశుసంపదను కాపాడడంలో రైతుల పాత్ర ఎంతో గొప్పది. వృషభరాజముల బలప్రదర్శన చూసేందుకు రైతులంతా తరలిరావడం సంతోషంగా ఉన్నది.