Transport allowance for Telangana students | తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. ప్రతి ఒక్కరూ చదువుకునేలా అన్ని విధాలుగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఉపకార వేతనాలను అందజేస్తున్నది. మధ్యాహ్న భోజనం పథకంతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ఇప్పటికే ఉచితంగా బస్సు పాస్‌లను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాఠశాలలు, రవాణా సౌకర్యం లేని పల్లె విద్యార్థులకు చార్జీలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల మొదట్లో రాష్ట్ర విద్యా శాఖ ఓ జీవో జారీ చేసింది. విద్యా హక్కు చట్టంప్రకారం విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించాలి లేదా భత్యం అందించాలి. చట్టం ప్రకారం 1-5వ తరగతి వరకు ఒక కిలోమీటర్, 8వ తరగతి వరకు 3 కిలోమీటర్లు, 9, 10 తరగతులకు 5 కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లల్లో చదువుకునే వారికి రవాణాభత్యం ఇవ్వాలి. ఇదివరకు ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే భత్యం ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి 9,10 తరగతుల వారికి కూడా వర్తింపజేస్తున్నారు. రాష్ట్రంలో రవాణా సదుపాయం లేని హ్యాబిటేషన్లు 3,150 ఉండగా, వాటిలో 30,488 మంది విద్యార్థులున్నట్టు అధికారులు గుర్తించారు.
ఇలాంటి పల్లెలు వికారాబాద్ జిల్లాలో 78 ఉన్నట్లు విద్యా శాఖ గుర్తించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 1095 పాఠశాలల్లో సుమారు లక్షా10వేలకు పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇప్పటికే సర్కారు కల్పిస్తున్న సదుపాయాలు, చక్కటి విద్యతో ఈసారి ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు 6466 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. వీరికి ఉచిత బస్‌పాస్ సదుపాయం కల్పిస్తున్నారు. జిల్లా పరిధిలోని 889 మంది విద్యార్థులకు 2021-22 సంవత్సరానికి రూ.26.67లక్షలు రవాణా చార్జీలు మంజూరయ్యాయి. చార్జీలు నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
పాఠశాల, రవాణా సదుపాయంలేని గ్రామాలకు చెందిన విద్యార్థులకు రవాణా చార్జీలు అందజేయడం కోసం ప్రత్యేకంగా రెండు కేటగిరీలుగా ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా పాఠశాల సదుపాయం లేని గ్రామాలు 78 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా మారుమూలన ఉండే గిరిజనతండాలు, చిన్న గ్రామాలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 3 కిలోమీటర్ల లోపు ఉండని గ్రామాల విద్యార్థులకు నెలకు రూ.400, ఉన్నత పాఠశాలలకు సంబంధించి 5 కిలోమీటర్ల లోపు ఉండని గ్రామాలవారికి నెలకు రూ.600 చొప్పున రవాణా చార్జీలుగా అందజేయాలని నిర్ణయించారు. విద్యార్థుల హాజరు శాతం 90కి పైగా ఉంటేనే ఈ సదుపాయం వర్తిస్తుంది. హాజరుశాతం తగ్గితే రవాణా చార్జీలూ తగ్గుతాయి. ఈ నిబంధన క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావడమే.
రవాణా భత్యం కింద జిల్లా పరిధిలోని సర్కారు బడుల్లో చదువుకుంటున్న 889 మంది విద్యార్థులకు 2021-22 సంవత్సరానికి రూ.26.67లక్షలు మంజూరయ్యాయి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి 687 మంది విద్యార్థులకు నెలకు రూ.400 చొప్పున రూ.20.61లక్షలు, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 202 మందికి నెలకు రూ.600 చొప్పున రూ.6.06లక్షలు మంజూరయ్యాయి. ఈ రవాణా భత్యం గతంలో పాఠశాల యాజమాన్య కమిటీల ఖాతాల్లో జమ చేసి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. అత్యంత పారదర్శకంగా పంపిణీ చేపట్టాలనే ఉద్దేశంతో ఈ నెలాఖరు లోపు విద్యార్థుల బ్యాంకు ఖాతా నంబర్లు పంపించాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. బ్యాంకు ఖాతా నంబర్లు పంపించిన తర్వాత డబ్బులు జమ చేయబడతాయి. రవాణా భత్యంతో ఆర్థిక ఇబ్బందులున్నా చదువుకునేందుకు ప్రోత్సహించడం, మరోవైపు విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేందుకు హాజరు నిబంధన పెట్టారు.
సర్కారు బడుల్లో చదువుకునేందుకు ప్రభుత్వం విద్యార్థులకు అనేక రకాలుగా తోడ్పాటునందిస్తున్నది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలతోపాటు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నది. స్కూల్ లెస్ హ్యాబిటేషన్ గ్రామాలకు చెందిన విద్యార్థులకు రవాణా భత్యం కింద ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు నెలకు రూ.400, ఉన్నత పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.600 ఇస్తారు. దీంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పాఠశాలలకు వచ్చేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.