కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 22 : సింగరేణి సంస్థ 133 సంవత్సరాలు పూర్తి చేసుకొని 134 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ ప్రధాన వేడుకలను కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సింగరేణి డైరెక్టర్(పా, ఫైనాన్స్, పీపీ) ఎన్.బలరాం అన్నారు. బుధవారం సింగరేణి హెడ్డాఫీస్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. సంస్థ వ్యాప్తంగా ఉన్న అని ఏరియాల్లో జరిగే సింగరేణి డే వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. గురువారం జరిగే వేడుకల్లో ఉదయం 9:30 గంటలకు సింగరేణి పతాకావిష్కరణ సంస్థ సీఎండీ ఆవిష్కరించి వివిధ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రారంభిస్తారన్నారు. తరువాత ఉత్తమ సింగరేణీయులు, ఉద్యోగులను సన్మానిస్తారు. సంస్థ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి మెమోంటోలు, బహుమతులను అందజేస్తారు. సాయంత్రం 6:30 గంటల నుంచి జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తీక్, రాము, నాగి కామెడీ షో, ప్రముఖ సినీ గాయనీ గాయకులు కృష్ణచైతన్య, ఉమానేహ, అనన్య భాస్కర్‌తో గానలహరి ఉంటుందన్నారు. డాక్టర్ సీతాప్రసాద్ నృత్యబృంద శాస్త్రీయ నృత్యప్రదర్శన ఉంటుందని, ఈ-టీవీ ఢీ షో బాబీ అండ్ టీమ్‌తో డాన్స్ పోటీలు ఉంటాయని, ఇమిటేషన్ రాజు మిమిక్రీ, స్టాండర్డ్ కామెడీ మొగిలి గుణాకర్, డూప్ బాలకృష్ణ అయిన రామకృష్ణ ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను సింగరేణి అధికారులు, ఉద్యోగులు, స్థానికులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జీఎం పర్సనల్ ఆనందరావు, జీఎం పర్సనల్ బసవయ్య, డీజీఎం పర్సనల్ ధన్పాల్ శ్రీనివాస్, సీనియర్ పీవో బేతిరాజు, పీఏ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.