చిట్యాల, ఆగస్టు 10 : ‘ఆరుగాలం కష్టపడినా ఫలితం దక్కడం లేదు.. ఫ్యాక్టరీ కాలుష్యం కారణంగా పంటల్లో ఎదుగుదల లోపించి తీవ్రంగా నష్టపోతున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నా
ఫ్యాక్టరీ కారణంగా వ్యవసాయం అంటేనే విసుగొస్తుంది’ అని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులోని ఎంపీఎల్ స్టీల్ ఇండస్ట్రీస్ కంపెనీ వదులుతున్న కాలుష్యంతో
పరిసర ప్రాంతాలన్నీ మసిబారుపోతున్నాయి. పచ్చని పొలాలు, చెట్లు, రహదారులు, సమీప గ్రామాల్లో ఇండ్లు.. ఇలా అన్నింటినీ మసి పొర కమ్మేస్తున్నది. ఏండ్ల తరబడి తాము ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు ఫిర్యాదులు చేసినా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంపెనీలో స్పాంజ్ ఐరన్ తయారీ సమయంలో నిబంధనల ప్రకారం దుమ్ము(డస్ట్)లేని పొగను మాత్రమే బయటకు వదలాలి. కానీ, మసి(నల్లని దుమ్ము)తో కూడిన పొగను విడుదల చేస్తుండడంతో కాలుష్యం ఏర్పడుతున్నది. పొగ కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత అందులోని నల్లని దుమ్ము తిరిగి నేలపై పడటంతో ఆ ప్రాంతమంతా నలుపు రంగులోకి మారుతున్నది. కంపెనీ నడిచే సమయంలో ఫిల్టర్లను ఉపయోగిస్తే దుమ్ము లేని పొగ మాత్రమే బయటకు వస్తుంది. కానీ, ఫిల్టర్లను వాడని కారణంగానే ఇలా జరుగుతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పంట నష్టంతో పాటు ప్రజలు సైతం కంపెనీ వదిలే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకొని దుమ్ము బారి నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. ‘కంపెనీ పొగ వల్ల రోడ్లపైన వెళ్లలేకపోతున్నాం. దుమ్ముపడి కండ్లు మంట మండుతున్నయి. బైక్పై వెళ్లేటప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది’ అని జక్కల సతీశ్ అనే స్థానికుడు వాపోయాడు.
కంపెనీ పొగతోని పంటలు ఆగమైతున్నయ్. మూగజీవాలు బావులళ్ల నీళ్లు తాగలేకపోతున్నయ్. పొలం పనులకు పోయెటోళ్లంతా మసిబారి నల్లగ అయితున్నరు. చెట్లు, పుట్టలు, దారులు కూడా మసిబారుతున్నయి.